దక్షిణాది వారసత్వ రాజకీయాల్లో మరో ‘రాజ్యాంగేతర’ శక్తి ఉదయించినట్టే! భూత కాలాన్ని, వర్తమానాన్ని పరిశీలించి చూసినా.. ఇక్కడ రాజ్యాంగేతర శక్తుల హవా సుస్పష్టమైనదే. ఈ పరంపరలో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మరో రాజ్యాంగేతర శక్తి హవా కొనసాగిస్తోంది. ఆమె మరెవరో కాదు… శశికళే.
జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే లో సమ్మోహన శక్తిగా మారిన శశి, ప్రతిపక్ష పార్టీ వాళ్లకు, బయటి వాళ్లకు మాత్రం రాజ్యాంగేతర శక్తిగా అగుపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇప్పటి వరకూ శశి ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులూ చేపట్టలేదు.. అయితే ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దగ్గర నుంచి అన్నాడీఎంకే నేతల్లో చాలా మంది శశి నామస్మరణ చేస్తున్నారు. ఆమెకు పాదాభివందనాలు చేస్తున్నారు. ఆ పార్టీ వాళ్లే అయ్యుంటే.. గొడవ ఉండేది కాదు. తాజాగా తమిళనాడులోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు అందరూ.. చిన్నమ్మ దర్శనం చేసుకొచ్చారు!
వర్సిటీల వైస్ ఛాన్స్ లర్లు అంటే.. వాళ్లు ఎంత బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న వారు? మరి రాజ్యాంగ బద్ధంగా ఏ హోదాలేని శశికళను దర్శనం కోసం వాళ్లు వెళ్లడం ఏమిటి? ఈ అంశంపై నే డీఎంకే నేత స్టాలిన్ గగ్గోలు పెట్టి గవర్నర్ కు లేఖ కూడా రాశాడు.
ఇదంతా చూస్తుంటే.. తమిళనాడు రాజకీయాలను శశికళ శాసిస్తోందనే అభిప్రాయాలు తప్పకుండా కలుగుతాయి. ఇలాంటి ఈమెను కట్టడి చేసేందుకు కేంద్రం తన యత్నాల్లో తను ఉంది. అయితే ఇప్పుడే అయిపోలేదు!
శశికళ అన్నాడీఎంకే అధినేత బాధ్యతలు తీసుకున్న తర్వాత అయినా… ‘రాజ్యాంగేతర శక్తి’ ముద్ర, ఆమె కనుసన్నల్లో పాలన సాగుతోందన్న విమర్శ తప్పదు! ఇలాంటి విమర్శలతో పాటు.. చీటికీ మాటికీ ఈమె జోక్యాన్ని ముఖ్యమంత్రి సహించనూ పోకపోవచ్చు! ఏతావాతా.. అవకాశం ఉన్నంత వరకూ అధికారం చెలాయించగలరేమో కానీ, ఒక్కసారి చేజారితే దీన్ని నిలబెట్టుకోవడం మాత్రం కష్టమే!