ఛాలెంజ్ చేసి మరీ పాక్ ను చిత్తు చేశారు!

ఊడీ ముష్కర దాడి అనంతరం.. స్పందించిన చాలా మంది భారతీయుల్లో ఒకరు ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ శ్రీజేష్. దొంగ దెబ్బ తీసిన పాక్ మీద కసి తో రగిలిపోతున్న భారతీయుల్లో ఆయన కూడా ఒకరు. ఆ సందర్భంలో శ్రీజేష్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. వచ్చే ఆసియా కప్ లో పాక్ ను చిత్తు చేస్తామని ప్రతినబూనాడు. తద్వారా అమరవీరులకు నివాళి ఘటిస్తామన్నాడు. 

“పాకిస్తాన్ చేతిలో ఓడి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచం. సరిహద్దులో పోరాడుతున్న సైనికుల కోసమైన విజయం సాధిస్తాం..ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కోసమైనా పాక్ ను ఓడిస్తాం..’’ అని ప్రతిజ్ఞ చేశాడు శ్రీజేష్. హాకీ టీమ్ కెప్టెన్ కి అప్పటికప్పుడు ఏ పాక్ జాతీయులు ఎదురుపడి ఉంటే ఏమయ్యే వారో కానీ.. ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో జట్టు తరపున తన మాటను నిలబెట్టుకున్నాడు టీమిండియా హాకీ కెప్టెన్.

మలేసియాలో జరుగుతున్న ఆసియా కప్ లో పాక్ పై భారత్ 3-2 గోల్స్ తో విజయం సాధించింది. తద్వారా శ్రీజేష్ జాతికి, సైన్యానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆవేశంలో ప్రతినబూనలేదు.. అని నిరూపిస్తూ ఆట తో అమరవీరులకు నివాళి ఘటించింది హాకీ టీమ్.

మరి ఇది పాక్ కు రెండు రకాల దెబ్బ అని చెప్పాలి. హాకీలో ఇండియా చేతిలో ఓటమి పాలవ్వడం ఒక విధమైన దెబ్బ అయితే.. ఇండియన్ కెప్టెన్ చెప్పి మరీ జట్టును విజయపథంలో నడిపించుకోవడం రెండో పంచ్.

Show comments