అప్పుడే కాంగ్రెస్ ఆఖరి అస్త్రాన్ని వాడేస్తోంది!

నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం యూపీఏ కు కొనసాగింపుగా తయారైంది తప్ప మరేం కాదన్న భావన దేశ ప్రజల్లో క్రమంగా బలపడుతున్నా… గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ కోలుకున్న దాఖలాలు ఏం కనపడలేదు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వస్తున్న ఫలితాల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పటి వరకూ ఈ పార్టీ వాళ్లు భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్ గాంధీ మాత్రం ఎవ్వరిలో కూడా ఏమాత్రం నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాడు.  

ఇప్పటికే ఒక రహస్య విదేశీ యాత్రను పూర్తి చేసిన రాహుల్, ఇప్పుడు అలాంటిదే మరోటి తలపెట్టి తెర వెనక్కు వెళ్లిపోయాడు. ఇలాంటి రాహుల్ తో ప్రయోజనం లేదని ఇప్పటికే కాంగ్రెస్ లోని నేతలు ఒక అంచనాకు వచ్చారు.అయితే ఈ విషయాన్ని బయటకు చెబితే ఏమవుతుందో.. సోనియమ్మ కు ఎక్కడ ఆగ్రహావేశాలు వస్తాయో అని వారు మిన్నకుండి పోయారు. 

అయితే యూపీ వంటిచోట మాత్రం రాహుల్ బలహీనతల మీద పార్టీ క్యాడర్ లో అసంతృప్తి చెలరేగింది. రాహుల్ తో ప్రయోజనం లేదు.. ప్రియాంకను పంపండి.. పార్టీని రక్షించండి అని కాంగ్రెస్ క్యాడర్ చాన్నాళ్లుగానే రచ్చ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వారి మొరను కాంగ్రెస్ అధిష్టానం కూడా విన్నట్టుగానే కనిపిస్తోంది. యూపీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారానికి హైకమాండ్ ఓకే చెప్పిందట. మొత్తం 155 చోట్ల ప్రియాంక ర్యాలీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 

ఇన్ని రోజులూ తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడికే కట్టబెట్టాలని శతథా ప్రయత్నించిన సోనియా కూడా పుత్రప్రేమను పక్కనపెట్టి.. ప్రియాంకకు బాధ్యతలు అప్పజెప్పడంలో తొలి అడుగు వేసింది.మరి తీవ్రమైన కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను ప్రియాంక ఏ మేరకు  రక్షిస్తుందో ప్రస్తుతానికి అంచనా వేయలేని వ్యవహారం.  

ఇక ప్రియాంక బరిలోకి దిగుతుండటాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ప్రియాంక దిగుతోందంటే.. రాహుల్ ఫెయిలయినట్టే కదా? అని బీజేపీ వాదిస్తోంది. అయినా ఇది నిర్వివాదాంశం కదా!

Show comments