స్వరం మార్చిన శరద్-పవన్

ఒక మాట పెదవి దాటేటపుడు నేను చాలా ఆలోచిస్తాను. మాట ఇస్తే దానికి కట్టుబడాలి..రాజకీయంగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని పలుకులు ఇవి. కానీ ఇవే పలుకులు సినిమా దగ్గరకు వచ్చేసరికి కనిపించడం లేదట. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను కొన్న కొందరు బయ్యర్ల కామెంట్ ఇది. విషయం ఏమిటంటే..

సర్దార్ గబ్బర్ సింగ్ ను కనీ వినీ ఎరుగని రేట్లకు అమ్మేసారు. సినిమా ఢమాల్ మంది. బయ్యర్లు కుదేలయ్యారు. కొందరు బయ్యర్లయితే కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా గాయబ్ అయ్యారు కూడా. అలాంటి టైమ్ లో టాలీవుడ్ లో వున్న మాటల కట్టుబాటు మేరకు, తరువాత సినిమా తక్కువ రేట్లకు ఇస్తామని నిర్మాత శరద్ మురార్, సినిమాలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ సదరు బయ్యర్లకు మాట ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా.

ఆ మేరకు కాటమ రాయుడు సినిమా ప్రారంభమైంది. ఈ మాట వుంది కాబట్టి. తక్కువ రేట్లకు ఇవ్వాలి కాబట్టి, కాటమరాయుడుని వీలయినంత బడ్జెట్ కంట్రోల్ లో తీస్తున్నారు. ఇప్పుడు సినిమా పూర్తి కావచ్చింది. ఇప్పుడు ఆ సినిమా అమ్మేందుకు కొత్త బయ్యర్ల కోసం వేట మొదలైందట. ఈ సంగతి తెలిసి అప్పుడు దెబ్బ తిన్న బయ్యర్లు కొందరు కాటమరాయడు నిర్మాత, పవన్ సన్నిహితుడు శరద్ మురార్ ను కలిసి తమకు సినిమా ఇవ్వాలని, డీల్ సెట్ చేయాలని కోరారట. కానీ దానికి ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.

మీరు బాగా దెబ్బతిన్నారు, డబ్బులు కట్టలేరు, ఈ రేట్లకు మీరు కొనలేరు అందుకే కొత్తవాళ్లను చూస్తున్నామని ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బయ్యర్లకు ఆయనకు కాస్త వాదనలు జరిగినట్లు వినికిడి. ఇప్పుడు ఆ పాత బయ్యర్లు కొందరు చాంబర్ మెట్లు ఎక్కాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

Show comments