ఎక్కడో కొడితే మరెక్కడో తగిలిందన్నది సామెత. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఒదిగి ఒదిగి వుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. లేదూ అంటే, మేనేజ్ మెంట్ల పై వత్తిడి, ఆపై జర్నలిస్ట్ కు ఉద్వాసన అన్నది కామన్ అయిపోయింది.
ఎన్టీవీ నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు బయటకు వచ్చింది ఈ విధంగానే. ఈ మధ్య మరో ఎడిటర్ కు కూడా ఇలాగే ఉద్వాసన అనివార్యమైందని మీడియా సర్కిళ్లలో వినిపిస్తోంది.
ఐ వై ఆర్ కృష్ణారావు ఉదంతం బయటకు వచ్చిన తరువాత ఆయనకు మద్దతుగా ఓ దినపత్రిక ఎడిటర్ వార్తలు, వ్యాసాలు వెలువరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త ఇబ్బంది కలిగించినట్లు బోగట్టా. ఆ వెంటనే సంబంధిత మేనేజ్ మెంట్ కు చెప్పాల్సిన విధంగా, చెప్పాల్సిన వాళ్లు చెప్పినట్లు వినికిడి.
పైగా ఐ వై ఆర్ కృష్ణారావు ద్వారానో మరో విధంగానో సంబంధిత ఎడిటర్ తన స్వంత పనులు చక్కబెట్టుకుని ముఫై అయిదు లక్షల వరకు లబ్దిఫొందినట్లు అంతకు ముందే వైకాపా అనుకూల పత్రిక సాక్షిలో అంతకు ముందే వార్తలు కూడా వెలువడ్డాయి.
అవీ ఇవీ కలిసి, ఎడిటర్ ను రాజీనామా చేయమని మేనేజ్ మెంట్ డిమాండ్ చేయడం, ఆ వెంటనే అది జరిగిపోవడం అయిపోయిందట. చిత్రమేమిటంటే, ఆ ఎడిటర్ కు ఆరెస్సెస్ తో భాజపాతో విపరీతమైన అనుబంధం వుంది.
అవేవీ ఈ ఉద్యోగాన్ని నిలబెట్టలేకపోయాయి. ఎన్నో ఎళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన ఆ ఎడిటర్, బాబు ముందు ఓడిపోయారని మీడియా సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి.