వివాదాస్పద అంశాల జోలికి వర్మ వెళ్లలేదు.. అని అంటున్నారు విజయవాడ రాజకీయాలపై అవగాహన ఉండి “వంగవీటి’’ సినిమాను చూసిన వాళ్లు. వర్మ అంతా పైపైన టచ్ చేసుకొంటూ వెళ్లాడని, కీలకమైన, ఆసక్తికరమైన అంశాలను ముట్టుకోనేలేదని వారు అభిప్రాయపడుతుండగా.. మరోవైపు వర్మ సినిమాపై పొలిటికల్ హీట్ మొదలైంది.
ఈ సినిమాలో అభ్యంతకరమైన సీన్లున్నాయని వంగవీటి రాధా అంటున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేయడం విశేషం. సినిమా విడుదలకు ముందు.. తాము అభ్యంతకరమైన సీన్ల గురించి వర్మకు చెప్పామని.. అయితే ఆయన వాటిని కత్తిరించలేదని రాధా చెప్పారు. ఈ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో రాధా పేర్కొన్నారు.
‘వంగవీటి’ విడుదలకు ముందు.. వర్మ- రాధాలు కూర్చుని చర్చించుకున్న సంగతి తెలిసిందే. వీరికి మధ్యవర్తిగా వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు. సినిమా పై రేగిన వివాదాల విషయంలో కొన్నింటిలో వర్మ తగ్గాడు. మరి కొన్నింటిలో తగ్గలేదు. ఈ నేపథ్యంలో వంగవీటి కుటుంబం అభ్యంతరాలు చెబుతోంది.
మరి అంతా పైన పైనే తీసుకెళ్లాడు… అంశంలోని అసలైన మసాలా లేదని విమర్శకులు పెదవి విరుస్తున్నా.. వివాదాలు, ఫిర్యాదులు అంటే, వర్మ మరింత లోతుగా వెళ్లి ఉంటే ఇంకెంత గొడవ రేగేదో!