విశాఖపట్నంలో ఈ నెల 26వ తేదీన 'ప్రత్యేక హోదా' కోసం భారీ నిరసన కార్యక్రమం జరగబోతోంది. తమిళనాడులో జల్లికట్టు ఆందోళన చినికి చినికి గాలి వాన అవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చిన దరమిలా, ఆంధ్రపదేశ్ యువత నుంచి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అదే బాటలో నడపాలన్న చిన్న ఆలోచన కాస్తా, ఇప్పుడు బృహత్ కార్యక్రమంలా రూపాంతరం చెందేలా కన్పిస్తోంది.
తమిళ సినీ ప్రముఖులు మొత్తంగా జల్లికట్టుకి మద్దతిచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కాంక్షిస్తూ తాము జరిపే పోరాటానికి తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు మద్దతివ్వదు.? అని, ఆంధ్రప్రదేశ్ యువత ప్రశ్నిస్తోంది. ఇప్పటికే చిన్నా చితకా నటీనటులు 'ప్రత్యేక హోదా పోరు'కి మద్దతు పలికారు. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖులు స్పందించడం మొదలుపెట్టారు.
పవన్‌కళ్యాణ్ తప్ప, పెద్ద స్టార్స్ ఎవరూ ఇంతవరకు ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. జనవరి 26వ తేదీ అంటే, పెద్దగా టైమ్ కూడా లేని పరిస్థితి. ఇంకోపక్క, తూతూ మంత్రంగా స్పందించేసి ఊరుకుంటే సరిపోదనీ, తమతో కలిసి రావాలంటూ ఆంధ్రప్రదేశ్ యువత డిమాండ్ చేస్తుండడంతో, విశాఖలో ఈ నెల 26న జరిగే కార్యక్రమంలో ఎంతమంది సినీ ప్రముఖులు హాజరవుతారు.? అన్న విషయమై ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్‌లో జరుగుతోంది.
తమిళనాడులో లారెన్స్ సహా కొందరు సినీ ప్రముఖులు మాత్రమే ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి, ఆంధ్రప్రదేశ్ యువతకు తోడుగా నిలిచే సినీ ప్రముఖులెవరు.? అసలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి, ఈ నెల 26న విశాఖలో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమంలో అటెండెన్స్ వుంటుందా.? లేదా.? వేచి చూడాల్సిందే.