క్షమాపణకీ 'షరతులు' వుంటాయా? ఏమో, మామూలుగా అయితే.. షరతుల్లేని క్షమాపణనే 'బేషరతు క్షమాపణ' అంటాం. తప్పు చేశానని ఎవరనన్నా అనుకుంటే, బేషరతు క్షమాపణ చెప్పడం ద్వారా తమ హుందాతనాన్ని చాటుకున్నట్లవుతుంది. తప్పు చేశానని ఒప్పుకుంటూనే, క్షమాపణ విషయంలో షరతులు వర్తిస్తాయంటేనే వ్యవహారం తేడా కొట్టేస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ, మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలుపుతూనే సెటైర్లు వేసేశాడు. అలా ఇలా కాదు, మహిళా లోకం సన్నీలియోన్‌ని చూసి నేర్చుకోవాలనీ, మహిళలు మగాళ్ళకు ఆమెలా ఆనందం పంచాలనీ.. ఇంకేవేవో మతిలేని విధంగా ట్వీట్లేశాడు. వర్మ నుంచి ఇలాంటి ట్వీట్లు రావడం సహజమేననుకోండి.. అది వేరే విషయం. అదే సమయంలో, వర్మ చుట్టూ వివాదాలు షురూ అవడం కూడా కొత్తేమీ కాదు. కానీ, ఈసారి వివాదాలకి వర్మ, కాస్త జడిసినట్లున్నాడు.
తప్పదు మరి.. కేసులు నమోదయ్యాక, కోర్టుకి పిలిస్తే.. ప్రతిసారీ ఏదో ఒక వాదన విన్పించి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా.! అయినాసరే, క్షమాపణ చెప్పినాసరే.. తన 'ఇమేజ్' తగ్గకూడదు. అందుకే, క్షమాపణ చెబుతున్నానంటూనే 'షరతులు వర్తిస్తాయ్..' అంటున్నాడు వర్మ. ఎవరైతే తన వ్యాఖ్యలతో బాధపడ్డారో వారందరికీ క్షమాపణ చెబుతూనే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తనకు హెచ్చరికలు జారీ చేసేవారికి ఈ క్షమాపణ వర్తించదని తేల్చి చెప్పాడాయన.
వర్మ, ఎంతలా కవరింగ్ ఇచ్చుకున్నా.. క్షమాపణ అయితే చెప్పేశాడు కదా.! క్షమాపణ చెప్పే పరిస్థితి తెచ్చుకోవడమెందుకట.? ఈ షరతులు వర్తిస్తాయ్.. అంటూ కలరింగ్ ఇవ్వడమెందుకట.?