మోడీ పాపం.. ముఖ్యమంత్రి పరిహారం.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద పాత నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకుని, అదేదో నల్లధనంపై పోరాటంలో ముందడుగు అనీ, నల్ల కుబేరులపై సర్జికల్‌ స్ట్రైక్‌ అనీ గొప్పగా ప్రకటించుకున్నారుగానీ, అది పేద ప్రజల ప్రాణాల్ని హరించే అస్త్రం మాత్రమేనని ఆ తర్వాత తేలింది. సుమారు 100 మంది వరకూ ఇప్పటిదాకా ఈ పెద్ద పాత నోట్ల రద్దుతో ప్రాణాలు కోల్పోయారు. 

బ్యాంకుల్లో వున్న తమ డబ్బుని బ్యాంకుల నుంచి, ఏటీఎంలనుంచి తీసుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారిని, ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకూ పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు. అసలు అంతమంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని క్దేంం పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ విషయాన్ని హైలైట్‌ చేస్తూ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో ప్రాణాలు కోల్పోయినవారికి 2 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అఖిలేష్‌ నిర్ణయం పట్ల ఓ పక్క హర్షం వ్యక్తమవుతూనే, ఇంకోపక్క విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

త్వరలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు జరగనున్న దరిమిలా, ఓటర్లను ఆకట్టుకునేందుకు, బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు అఖిలేష్‌ యాదవ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే, అదే సమయంలో.. అఖిలేష్‌ నిర్ణయం స్వాగతించదగ్గదేననీ, ప్రధాని నరేంద్రమోడీ చేసిన పాపానికి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న దరిమిలా, తమ రాష్ట్రంలో చనిపోయిన ప్రజల్ని ఆదుకోవడం ఆయా రాష్ట్రాల విధి అని ఇంకొందరు అభిప్రాయపడ్తున్నారు. 

పెద్ద పాత నోట్ల రద్దుతో తలెత్తే కరెన్సీ సంక్షోభంపై ముందస్తు అవగాహన లేకుండా, నల్లధనంపై పోరాటం అనే పేరుతో 'సెంటిమెంట్‌' రాజేసి, జనాల ప్రాణమ్మీదకు తెచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ నిర్ణయంతో ఒక్క నల్ల కుబేరుడు కూడా తెరపైకి రాలేదు. ఏ నల్ల కుబేరుడూ క్యూ లైన్లలో కన్పించలేదు.. కానీ, సామాన్యులు రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితుల్లో అఖిలేష్‌ నిర్ణయం రాజకీయ అవసరాల కోణంలో తీసుకున్నదే అయినా నూటికి నూరుపాళ్ళూ ఆహ్వానించదగ్గదే. ఎందుకంటే, ప్రాణాలు కోల్పోయింది పేద ప్రజలే గనుక. 

నోట్లు మారవేమోనని ఓ నిరుపేద కుటుంబం, తినే ఆహారంలో విషయం కలుపుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కలకలం రేపింది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. అలా ఆత్మహత్య చేసుకున్న ఓ కుటుంబానికి యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ 5 లక్షల పరిహారాన్ని ప్రకటించడం గమనార్హం.

Show comments