కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని పంపేయాలని డిసైడ్ చేసింది.. ఆ మాట మీతోనే చెప్పించింది. మీరు వాళ్లకు నచ్చలేదు.. పంపించేస్తున్నారు.. ఇక అర్థం చేసుకని సైలెంట్ గా ఉండాల్సింది. మంచో చెడో.. మీరు యూపీఏ నియమిత ఆర్బీఐ గవర్నర్ అనో, లేక మీ వ్యవహారాలు నచ్చకో పంపించేస్తున్నారు. ఇక వెళ్లిపోండి. అంతే కానీ.. ఇలా “నాకు వెళ్లాలని లేదు..’’ ‘ ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలని ఉంది..’’ అంటే ఎలా?
మరోసారి తన ఆకాంక్షను బయట పెట్టుకున్నాడు రఘురాం రాజన్. ఆర్బీఐ గవర్నర్ గా ఇక ఒకటీ రెండు రోజుల పదవీ కాలాన్నే కలిగిన రాజన్.. “ ఐ వాంటెండ్ టు స్టే’’ అంటున్నారు. ఈ పదవి నుంచి వైదొలగాలని.. తను అనుకోలేని చెబుతున్నాడు. మూడేళ్ల పదవీ కాలంతో కాదు.. తను అనుకున్న ఫలితాలు రాబట్టడానికి కొనసాగి ఉంటే బావుండేదని రాజన్ అంటున్నాడు.
ఈ ఆర్బీఐ గవర్నర్ ను ఎలా ఇంటికి పంపిస్తున్నారో వేరే వివరించనక్కర్లేదు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి రాజన్ భారతీయతను శంకించాడు. రాజన్ కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నాడు. అక్కడ నుంచి మొదలైంది. ఈ విషయంలో అధికార పార్టీ నుంచి ఏదో కంటితుడుపు చర్యలే తప్ప రాజన్ కు దన్నుగా నిలబడలేదెవరూ. దీంతో రాజన్ తప్పుకోక తప్పడం లేదు.
ఇప్పటికే రాజన్ కు ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసింది కేంద్రం. రిలయన్స్ అంబానీలకు అత్యంత సన్నిహితుడిని ఆర్బీఐ పీఠం మీద కూర్చోబెట్టనున్నారట! మరి ఈ దేశానికి అంత కన్నా ఏం కావాలి?
ఎంపీగా పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోయిన వ్యక్తి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండొచ్చు. అపర కుబేరుల ఆస్థానంలోని వ్యక్తి చేతిలో ఆర్బీఐ ని పెట్టొచ్చు. అంతే కానీ.. రాజన్ కు మాత్రం ఆ అర్హత లేదు. అంతే.. అధికారంలో ఉన్న వారు చెప్పినట్టు!