చినబాబు చేతిలో ఇక ‘మంత్రి’ దండం...!

ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ వస్తుందా? రాదా? పోలవరానికి నిధులు వస్తాయా? రావా? రాజధాని నిర్మాణానికి కేంద్రం డబ్బులు వస్తాయా? రావా?...ఇలాంటి సవాలక్ష సందేహాల్లో మరో ముఖ్యమైన సందేహం కూడా ఉంది. ఇది రాష్ట్రానికి జీవన్మరణ సమస్య కాదు. కాని ఈ పని అవుతుందా? కాదా? అని టీడీపీ నాయకులకు, మీడియా వర్గాలకు యమ ఆతృతగా ఉంది. ఇంతలా వేధిస్తున్న సమస్య ఏమిటి?  అదే చినబాబుకు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు, ఆస్తులకు, రాజకీయాలకు వారసుడైన లోకేష్‌బాబుకు మంత్రి పదవి వస్తుందా? రాదా? అని రాజకీయ, మీడియా వర్గాలు ప్రశ్నించుకుంటున్నాయి. లోకేష్‌కు మంత్రి పదవి గురించి తెలుగు, ఆంగ్ల పత్రికల్లో అప్పుడప్పుడూ కథనాలు వస్తూనే ఉన్నాయి. వీటి సారాంశం...త్వరలో చినబాబుకు మంత్రి పదవి ఇస్తారని. రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆయన్ని రాజ్యసభకు పంపి కేంద్రంలో మంత్రిని చేయాలనుకుంటున్నారని, రాష్ర్టంలోనే ముందు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తారని రెండు రకాల కథనాలొచ్చాయి. సరే...రాజ్యసభ ఎన్నికల అంకం ముగిసింది కాబట్టి మిగిలింది రాష్ర్ట కేబినెట్‌లో మంత్రి కావడం. ఈమధ్య మరో వార్త హల్‌చల్ చేసింది. ఏమిటది?

రాష్ర్ట అధికార ప్రతినిధిగా ఢిల్లీ పంపుతారని. ఇప్పటివరకు ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు పదవీ ముగిసిపోయినా పొడిగించలేదు. లోకేష్‌ను ఆయన స్థానంలో పంపేందుకు నిర్ణయం జరిగింది కాబట్టి కంభంపాటి పదవీ కాలం పొడిగించలేదని కథనాలొచ్చాయి. లోకేష్‌ను చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు పంపాలనుకుంటున్నారో కారణాలు వివరిస్తూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. దాని ప్రకారం...ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉండటానికి లోకేష్ సరైన నాయకుడు. బాబు కుమారుడిగానే కాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన పలుకుబడి, ఇమేజ్ ఉపయోగించి కేంద్రంలో రాష్ట్రానికి అవసరమైన పనులు సాధించగలడు. అందుకు తగిన నేర్పు, సామర్థ్యం ఆయనకు ఉన్నాయి. చాలామంది టీడీపీ నాయకులకు లేని ప్లస్ పాయింట్ లోకేష్‌కు ఉంది. ఏమిటది? ఈయన ఇంగ్లిష్, హిందీ భాషల్లో దిట్ట. రెండింటినీ అనర్గళంగా మాట్లాడగలడు. ఢిల్లీలో ఉండే అధికార ప్రతినిధికి ఈ సామర్థ్యం అవసరం. అది లోకేష్ దగ్గర ఉంది కాబట్టి సమస్య లేదు.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం చినబాబును ఢిల్లీకి పంపడంలేదు. సాధారణంగా ఢిల్లీలో అధికార ప్రతినిధిగా పార్టీ నాయకుడికే అవకాశం ఇస్తారు. ఈ లెక్క ప్రకారం కంభంపాటి రామ్మోహన్‌రావు స్థానంలో మరో నాయకుడిని పంపాలి. కాని బాబు కొత్త ఆలోచన చేశారట...! ఒక ఐఏఎస్ అధికారిని అధికార ప్రతినిధిగా పంపుతున్నారట...! కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో వ్యవహరించేందుకు నాయకులకు సామర్థ్యం లేదని బాబు భావిస్తున్నారేమో...! ఐఏఎస్ అధికారైతే భాషా సమస్య ఉండదు. పైగా చట్ట పరిజ్ఞానం, పరిపాలనా వ్యవహారాలు తెలిసివుంటాయని అనుకుంటున్నారేమో...! కారణాలు ఏమైనా లోకేష్ ఢిల్లీ వెళ్లడం డ్రాప్ అయినట్లుగా కనబడుతోంది. ఓ ఆంగ్ల పత్రిక సమాచారం ప్రకారం లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు నిర్ణయించుకున్నారు. ఆయనైతే బహిరంగంగా ప్రకటించలేదుగాని అధికారులతో ఆయన మాట్లాడిన తీరును బట్టి కుమారుడికి మంత్రి పదవి ఇస్తారని అంచనా. ఈ పని సెప్టెంబరులో జరగొచ్చని అనుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో మూడు మంత్రుల ఛాంబర్లు అదనంగా నిర్మించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంటే కేబినెట్‌లోకి మరో ముగ్గురిని కొత్తగా తీసుకుంటారన్నమాట. పుష్కరాల తరువాత సెప్టెంబరులో ఈ పని చేస్తారట. ప్రస్తుత మంత్రివర్గంలో రెండు ముఖ్యమైన సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం లేదు. అవి: ముస్లింలు, గిరిజనులు.

కారణాలు ఏవైనా ఇప్పటివరకు ఈ రెండు సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం లేకపోవడం రాజకీయంగా నష్టం కలిగించే అంశం. ఈ సామాజికవర్గాలతోపాటు లోకేష్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకోవాలని  బాబు కోరిక. అందుకే మూడు ఛాంబర్లు తయారుచేయాలని చెప్పారు. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన బాబుకు ఉండటమే కాకుండా పార్టీ నాయకులూ డిమాండ్ చేశారు. కొందరు కేంద్రానికి పంపాలంటే, కొందరు రాష్ర్టంలోనే ఉండాలన్నారు. చివరకు బాబు ‘రాజకీయ లెక్కల’ ప్రకారం కుమారుడిని రాష్ర్టంలోనే ఉంచాలని అనుకున్నట్లున్నారు. ప్రధానమైన పరిశ్రమలు, విద్యుత్తు శాఖలు చంద్రబాబు దగ్గరే ఉన్నాయి. వాటిని లోకేష్‌కు అప్పగిస్తారని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, చినబాబుకు మంత్రి పదవి ఇవ్వొద్దనేవారూ ఉన్నారు.లోకేష్‌కు మంత్రి పదవి వద్దనేవారు ఆయన వ్యతిరేకులేం కాదు.     

వీరి వాదన ఏమిటంటే...ఆయనకు పదవి ఇస్తే దాంట్లో బిజీ అయిపోతాడు కాబట్టి పార్టీ కార్యక్రమాలు చూసుకునేవారుండరని, పార్టీ అనాథ అయిపోతుందని అంటున్నారు. లోకేష్ జాతీయ కార్యదర్శిగా చాలా బాగా పనిచేస్తున్నారని, పార్టీ  కార్యక్రమాలను సజావుగా నిర్వహిస్తున్నారని, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ సంక్షేమ నిధి సమన్వయకర్తగా పనిచేస్తూ కార్యకర్తల యోగక్షేమాలు తెలుసుకుంటున్నారని, పార్టీ తరపున విద్యా కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ఆయన మంత్రిగా వెళ్లిపోతే ఇంత చక్కగా ఎవరు పనిచేస్తారని ప్రశ్నిస్తున్నారు. అదీగాకుండా, పార్టీ నాయకుడిగా బాగా అనుభవం వస్తేనే మంత్రిగా రాణించే అవకాశం ఉంటుందని, కాబట్టి ఇప్పుడే పదవి కోసం తొందర పడొద్దని చెబుతున్నారు. పార్టీలో ఉన్నతస్థాయి నాయకుడి నుంచి అట్టడుగు కార్యకర్త వరకు ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలుస్తూ ఆప్యాయంగా మాట్లాడే పరిస్థితి రావాలని, లోకేష్ ఆ స్థితికి ఇంకా చేరుకోలేదని మంత్రి పదవిని వ్యతిరేకించే నాయకులు చెబుతున్నారు. ఎలా చూసినా లోకేష్ మంత్రయ్యే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మంత్రిగా రాణిస్తున్నారని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇలాంటి ప్రశంసలు లభించాలంటే చినబాబు కూడా మంత్రి కావాలన్నదే తమ్ముళ్ల కోరిక. చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో....!

-మేనా

Show comments