జూ.ఎన్టీఆర్‌ సరసన మళ్ళీ కాజల్‌.?

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫేం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం విదితమే. ఈ సినిమా కోసం హీరోయిన్‌ వేట కొనసాగుతోంది. కొత్త హీరోయిన్‌ని తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్నా, తాజాగా హీరో, డైరెక్టర్‌ సెర్చింగ్‌ అందాల చందమామ కాజల్‌ దగ్గర ఆగిపోయిందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. 

కాజల్‌తో ఎన్టీఆర్‌ గతంలో 'బృందావనం', 'టెంపర్‌' సినిమాలు చేశాడు. ఆ రెండూ మంచి విజయాలు సాధించాయి. ఎన్టీఆర్ కోసమే, కాజల్ తొలిసారిగా ’జనతా గ్యారేజ్‘ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది కూడా. దాంతో సెంటిమెంట్‌ ప్రకారం ఎన్టీఆర్‌, కాజల్‌కే ఓటేశాడని తెలుస్తోంది. అయితే, బాబీ దర్శకత్వంలో కాజల్‌ హీరోయిన్‌గా నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఫలితం తేడా కొట్టేసింది. మరోపక్క, ఓ కేరళ బ్యూటీ పేరుని కూడా పరిశీలిస్తున్నారట ఈ సినిమా కోసం. ఆమె ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 

ఇదిలా వుంటే, 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్‌' తర్వాత తదుపరి సినిమా చేయడానికి ఎన్టీఆర్‌ మల్లగుల్లాలుపడ్డాడు. ఎవరితో చేయాలి.? అన్నదానిపై అంత తేలిగ్గా ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. చివరికి ఎన్టీఆర్‌ అన్వేషణ బాబీ దగ్గర ఆగింది. సినిమా త్వరలో ప్రారంభం కానుంది. అప్పటికల్లా హీరోయిన్‌ పేరు ఫైనల్‌ కానుంది.

Show comments