ఇట్‌ హ్యాపెన్స్‌.. అంతే.!

తుని రైలు దహనం కేసులో వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని ఏపీ సీఐడీ విచారిస్తోంది. తొలి దఫా విచారణ నేడు జరిగింది. రేపు రెండో దఫా విచారణ జరుగుతుంది. రైలు దహనం వెనుక భూమన కరుణాకర్‌రెడ్డి హస్తం వుందన్నది అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అధికారం తమ చేతుల్లో వుంది గనుక, సీఐడీ అనేది ఏపీ ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుంది గనుక.. తేలిగ్గానే 'భూమన'కు నోటీసులు అందాయి. 

తప్పుంటే భూమన బుక్కయిపోతారేమో.! తప్పున్నా ఆయన తప్పించుకోడానికి దారుంది. అదే, చంద్రబాబు ముందు సరెండర్ అయిపోవడం. కానీ, ఆయన అందుకు ఒప్పుకోకపోవచ్చు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు చూస్తున్నాం కదా. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికేశారు. 'నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..' అని సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, చంద్రబాబుని హెచ్చరించారు. కానీ, ఏం జరిగింది.? 

చంద్రబాబు, కేసీఆర్‌ కాళ్ళు పట్టేసుకున్నారో.. ఓటుకు నోటు కేసుకి విరుగుడుగా చంద్రబాబు తెరపైకి తెచ్చిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో కేసీఆరే స్వయంగా కాళ్ళ బేరానికి వెళ్ళారోగానీ, మధ్యలో తెలంగాణ ఏసీబీ అభాసుపాలయిపోయింది. ప్రస్తుతం వ్యవహారం కోర్టులో వున్నా, ఈ కేసు నుంచి చంద్రబాబు తెలివిగానే తప్పించుకున్నారన్నది నిర్వివాదాంశం. 

ఓటుకు నోటు కేసుకు సంబంధించి, చంద్రబాబు 'బ్రీఫింగ్‌' చేసిన వైనం ప్రపంచమంతా వినేసింది. కానీ, ఇక్కడ చంద్రబాబుకి తెలంగాణ ఏసీబీ నుంచి నోటీసుల్లేవు.. కేసు వెలుగులోకి వచ్చి ఏడాదైనాసరే. భూమన కరుణాకర్‌రెడ్డి వివాదానికి సంబంధించి, ఇంతవరకు అధికార పార్టీ ఎలాంటి ఆధారాన్నీ తెరపైకి తీసుకురాలేదు. కానీ, సీఐడీ విచారణకు భూమన హాజరవ్వాల్సి వచ్చింది. ఏమిటీ మాయ.? ఇట్‌ హ్యాపెన్స్‌ అంతే.. అని సరిపెట్టుకుందామా.? వ్యవస్థలిలా తగలడినందుకు మనల్ని మనమే నిందించుకుందామా.? 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న వేళ, ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బకొట్టేందుకు, అధికార పార్టీ పన్నిన వ్యూహమే.. భూమన కరుణాకర్‌రెడ్డిని ఇరికించడం. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అనవసరం. నిప్పు నారా చంద్రబాబునాయుడు నిస్సిగ్గు రాజకీయమా.? మజాకానా.!

Show comments