జరిగి రెండేళ్లు...ఇక నిజాలు తెలియవా?

బడా రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు, పాలకుల ప్రమేయం ఉన్న కేసులు మన దేశంలో త్వరగా పరిష్కారానికి నోచుకోవు. ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. కేసుల్లో పాలకులే నిందితులైతే ఆ కేసుల విచారణకు అతీగతీ ఉండదు. వారి పరిపాలన ముగిసిపోయినా కేసులు మాత్రం తేలవు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిందితుడిగా ఉన్న రెండు ప్రధానమైన, తీవ్ర సంచలనం కలిగించిన కేసుల్లో ఫలితం ఏమిటన్నది ఇప్పటివరకు తేలలేదు. ఈ ఘటనలు జరిగి రెండేళ్లు దాటిపోయినా నిజానిజాలు బయటకు రాలేదు. నిజాలు ఏనాటికైనా బయటపడతాయా? ఏమో చెప్పలేం. నిజాలు బయటపడకుండానే ఎన్నో కేసులు కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిల్లో చంద్రబాబు ప్రమేయం ఉన్న కేసులూ చేరవచ్చు.

ఏమిటీ రెండు కేసులు? ఒకటి గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో తొలి రోజే తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయి, 51 మంది గాయపడిన ఘటన. మరోటి తీవ్ర సంచలనం కలిగించిన 'ఓటుకు నోటు' కేసు. చంద్రబాబు కారణంగానే గోదావరి పుష్కరాల్లో దారుణం జరిగిందని అప్పట్లో మీడియాలో అనేక కథనాలొచ్చాయి.

ఆయన పొద్దున్నే పుష్కర స్నానం చేయడానికి రావడం, దాన్ని ప్రచార చిత్రంగా ఓ టీవీ ఛానెల్‌ కోసం చిత్రీకరించడం, ఆ సమయంలో గేట్లు మూసివేసి, ఆ తరువాత ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం.. ఇదంతా తెలిసిందే. ఇక నోటుకు ఓటు కేసులో తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్‌ రెడ్డిది ప్రత్యక్ష ప్రమేయం కాగా, చంద్రబాబుది పరోక్ష ప్రమేయం. డబ్బు ఆశ చూపిన టీఆర్‌ఎస్‌ అసోసియేట్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు చంద్రబాబు ఫోన్‌లో ధైర్యం చెప్పడం, అన్ని విషయాలు తాను చూసుకుంటానని, భయపడకుండా టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని చెప్పడం.. ఈ చరిత్రా తెలిసిందే.

పుష్కరాల ఘటన 2015 జులైలో జరగ్గా, నోటుకు ఓటు ఘటన అదే ఏడాది మే నెలలో జరిగింది. రాజమండ్రి ఘటనపై విచారణకు రిటైర్డ్‌ న్యాయమూర్తితో బాబు సర్కారు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రెండేళ్లు గడిచినా ఇప్పటివరకూ అతీగతీ లేదు. కమిషన్‌ గడువు ముగుస్తున్నా కొద్దీ పొడిగిస్తూ పోతున్నారు. ఇప్పటివరకు ఆరుసార్లు పొడిగించారు.

అధికార యంత్రాంగం చాలాకాలం కమిషన్‌కు సహకరించలేదు. ఎందుకు సహకరించలేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్దేశపూర్వకంగానే అధికార యంత్రాంగం చాలాకాలం సాక్ష్యాలను కమిషన్‌కు సమర్పించలేదని బాధితుల తరపు న్యాయవాది చెప్పారు. ఈ కేసులో తొలి విచారణే ఘటన జరిగిన ఆరు నెలల తరువాత జరిగింది. ఇలాంటి కేసు తేలుతుందనే నమ్మకముందా?

నోటుకు ఓటు కేసులో 'చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా రక్షించలేడు' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరంగం వేశారు. కాని ఆ తరువాత బాబుతో పలుమార్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఈ కేసు ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'ప్రత్యర్థులు నాపైన 26 కేసులు పెట్టారు. ఒక్కదాంట్లోనూ ఆరోపణలు రుజువు కాలేదు. కొన్ని కేసులు కొట్టేశారు' అని బాబు గొప్పగా చెబుతుంటారు.

దీంతో బాబు న్యాయమూర్తులను కూడా మేనేజ్‌ చేస్తారనే పేరొచ్చింది. ఇతర కేసుల్లో ఏదో మాయ చేసి తప్పించుకున్నా ఓటుకు నోటు కేసులో తప్పించుకోలేరని ప్రత్యర్థులు చెబుతుంటారు. నిజానికి గోదావరి పుష్కరాల దుర్ఘటన, ఓటుకు నోటు కేసు ఛేదించలేని క్లిష్టమైన కేసులేం కావు. భయంకరమైన ఉగ్రవాద ఘటనలనే ఛేదిస్తుండగా ఈ కేసుల్లో నిజాలేమిటో తెలుసుకోవడం 

పెద్ద కష్టం కాదు. కాని ఎందుకు తెలుసుకోరు? పెద్దోళ్ల కేసులు ఇలాగే ఉంటాయి. అంతే...!

Show comments