చంద్రబాబూ వాట్‌ నెక్స్‌ట్‌.!

కృష్ణా పుష్కరాలు రేపటితో పూర్తయిపోనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణలో పుష్కర స్నానం ఆచరించేసి ఊరుకున్నారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులకు పూర్తిగా పుష్కరాల పనుల్ని అప్పగించేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అంతే తప్ప, పుష్కరాల గురించి ఆయన పెద్దగా చేసిన హడావిడి ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అలా కాదు, మొత్తంగా పరిపాలనని గాలికొదిలేసి పుష్కరాలే జీవిత లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. 

ప్రతిరోజూ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కృష్ణా హారతి కార్యక్రమంలో పాల్గొనడం, అంతలావు 'క్లాస్‌' తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది చంద్రబాబుకి. పుష్కర హారతి అంగరంగ వైభవంగా జరుగుతోందని, అది చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన పుష్కర యాత్రీకులు, చంద్రబాబు ప్రసంగంతో బోరెత్తిపోయారనడం అతిశయోక్తి కాదేమో. ప్రతీ రోజూ ఒకటే తంతు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయింది.. అని. 

కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి చర్చిద్దాం, కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం.. లాంటి పనులేవీ చంద్రబాబు గడచిన పదకొండు రోజుల్లో చేయలేదాయె. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులూ అందరూ పుష్కరాల్లో మునిగి పునీతులైపోయారు. చంద్రబాబు సర్కార్‌ ఏ స్థాయిలో పుష్కరాల్లో మునిగి తేలిందంటే, ఆఖరికి.. తాతాలిక సచివాలయం ఏమయ్యిందో కూడా తెలియలేదు మరి.! 

ఆగస్ట్‌ 15.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అనంతపురం వెళ్ళి (ఇక్కడే అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది), అక్కడినుంచి విజయవాడకు చేరుకుని, అట్నుంచి మళ్ళీ హైద్రాబాద్‌లో గవర్నర్‌ నిర్వహించిన ఎట్‌హోం కార్యక్రమానికి హాజరై, తిరిగి విజయవాడలో కృష్ణా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఇలా పుష్కరాలకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దారుణమేంటంటే, ఆగస్ట్‌ 15న తాత్కాలిక సచివాలయంపై జాతీయ జెండా అధికారికంగా ఎగరేయలేకపోయింది చంద్రబాబు సర్కార్‌. 

పుష్కరాల చివరి రోజైన రేపు, ఒలింపిక్‌ గేమ్స్‌లో రజత పతక విజేత పీవీ సింధుని ఘనంగా సన్మానించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఒక్క రోజు ఆగితే, ప్రశాంతంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, ఇక్కడా చంద్రబాబు పుష్కరాల కక్కుర్తి సుస్పష్టం. ఉదయాన్నే గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి సింధుతోపాటు ఆమె కోచ్‌ గోపీచంద్‌ని ర్యాలీగా సన్మాన వేదికకు తీసుకెళ్ళేందుకు భారీ ఏర్పాట్లను చంద్రబాబు సర్కార్‌ చేస్తోంది. అసలే, బెజవాడ పుష్కరాల సందడితో ఇసకేస్తే రాలనంత ఇరుకుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ హంగామా ఇప్పుడే అవసరమా.? 

ఏదిఏమైనా, పుష్కరాల పేరు చెప్పి చంద్రబాబు పబ్బం గడుపుకున్నారు.. పబ్లిసిటీ స్టంట్లు చేశారు, చేస్తూనే వున్నారు. పుష్కరాలు పూర్తయ్యాక పరిస్థితేంటి.? ప్రత్యేక హోదాపై మాట్లాడతారా.? తాత్కాలిక సచివాలయం సంగతి చూస్తారా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.

Show comments