రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో 2.0'పై కోలీవుడ్‌తోపాటు, టాలీవుడ్, బాలీవుడ్‌లలోనూ భారీ అంచనాలే వున్నాయి. ఆ మాటకొస్తే, శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషలతోపాటు, విదేశీ భాషల్లోకీ డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఆయా దేశాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రజనీకాంత్‌కి ఫాలోయింగ్ వున్న దేశాల్లో ఈ సినిమా గురించి ఎదురుచూపులు అప్పుడే షురూ అయ్యాయి కూడా.
ఇక, 'రోబో 2.0' ఎలా వుండబోతోంది.? అన్న ప్రశ్నకు శంకర్ నుంచి 'నో కామెంట్' అన్న మాటే సమాధానంగా వస్తోంది. 'తినబోతూ రుచి చూడటమెందుకు..' అంటాడు శంకర్. రజనీకాంత్‌గానీ, ఇంకెవరైనాగానీ ఈ సినిమా గురించి చిన్న 'లీకేజీ' కూడా ఇవ్వడంలేదు. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ మాత్రం సినిమాలో తన పాత్ర గురించి చిన్న లీక్ అందించాడు. సైంటిస్ట్‌గా ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ నటిస్తున్నాడు. అదే విలన్ పాత్ర. విలన్ ఈ చిత్రంలో పక్షుల ప్రేమికుడట.
ఇదిలా వుంటే, ఈ 'రోబో 2.0'కీ, హృతిక్ రోషన్ హీరోగా గతంలో వచ్చిన 'క్రిష్-3'కీ చాలా దగ్గరి సంబంధాలున్నాయట. ఆ సినిమాలోలానే ఇందులో చాలా సన్నివేశాలుంటాయని ప్రచారం జరుగుతోంది. హృతిక్ తరహాలో రజనీకాంత్‌తో శంకర్ స్టంట్స్ చేయించేశాడట. 'రోబో' సినిమాలో అత్యున్నతమైన గ్రాఫిక్స్‌తో అద్భుతాలు చేసిన శంకర్, అంతకు మించిన అద్భుతాల్ని '2.0'తో చూపించబోతున్నాడన్నది నిర్వివాదాంశం. మరి, క్రిష్ - రోబోల మధ్య పోలిక మాటేమిటి.? దీనికి శంకర్ సమాధానం చెప్పాల్సి వుంటుంది.