ఇకపై, టీడీపీ అధినేత చంద్రబాబు 'నిప్పు, నిజాయితీ' అనే పదాల్ని ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తాను టీఆర్‌ఎస్‌లో చేరి, మంత్రినయితే.. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారనీ, విలువల గురించి మాట్లాడారనీ, రాజకీయ వ్యభిచారమంటూ విమర్శలు చేశారనీ, ఇప్పుడు ఆయనేం చేస్తున్నారని తలసాని ప్రశ్నించారు. చంద్రబాబుని తెలంగాణ ప్రజలెప్పుడో తిరస్కరించారనీ, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలూ ఆయనకు బుద్ధి చెబుతారంటూ తలసాని మండిపడిపోయారు.
అరరె, తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా నీతులు చెప్పేస్తారా.? సవాల్ విసిరేస్తారా.? అనేదే కదా మీ అనుమానం.! రాజకీయాల్లో ఎవరైనా నీతులు చెప్పేయొచ్చు. చంద్రబాబే చెప్పగా లేనిది, తలసాని చెబితే ఏంటట.? తలసాని, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అది రాజకీయ వ్యభిచారమని చంద్రబాబు విమర్శించేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఏం చేశారు.? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు.
కానీ, చంద్రబాబు నిప్పు. అవును, నిజాయితీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అంతే.! నిప్పు, నిజాయితీ అన్న మాటలకి ఆయనెప్పుడో అర్థం మార్చేశారు గనుక.. ఆయన చెబుతున్నది నిజమే కావొచ్చుగాక. ఇప్పుడూ ఆయన రాజకీయాల్లో తాను నిప్పులాంటోడిననే చెబుతారు, నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్‌ననే అంటారు.
సిగ్గు సిగ్గు.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో గవర్నర్ పాత్ర అత్యంత హాస్యాస్పదంగా మారిపోయింది. ఇదే గవర్నర్‌ని పట్టుకుని, చంద్రబాబు దులిపేశారు తలసానికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు. అదే గవర్నర్ నరసింహన్ సాక్షిగా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల్ని ఇప్పించుకున్నారు చంద్రబాబు. తనను అంతలా తిట్టిన చంద్రబాబుకి నరసింహన్ ఎలా, ‘ఛాన్స్’ఇచ్చారో ఏమో కదా.!
అధికారంలో వున్నవారు తప్పు చేస్తే, గవర్నర్‌కి ఫిర్యాదు చేయడం ఆనవాయితీ. కానీ, ఆ తప్పులకి గవర్నర్ సాక్షి అయితే, ఇంకెవరికి ఫిర్యాదు చేయాలట.? ఏమోగానీ, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా వున్నాననీ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయిస్తారా.? అని తలసాని విసిరిన సవాల్‌కి.. చంద్రబాబు స్పందిస్తారా.? వేచి చూడాల్సిందే.