కేఈ 'కథ' అదిరిందిలే

తన కుమారుడు 'కో-ఆర్డినేటర్‌'గా వ్యవహరిస్తోన్న పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి, ప్రత్యర్థి పార్టీ ముఖ్య నేత దారుణ హత్యకు గురైతే, అందులో తన పుత్రరత్నం మీదనే ఆరోపణలు వెల్లువెత్తుతోంటే, ఉప ముఖ్యమంత్రి అయి వుండీ, టీడీపీ సీనియర్‌ నేత కేఈ కృష్ణమూర్తి 'కథ' వినిపిస్తున్నారు. 'ఎవర్నీ చంపాల్సిన అవసరం మాకు లేదు.. మేం ప్రతిపక్షంలో వున్నప్పుడు రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. చాలా నష్టపోయాం.. భయభ్రాంతులకు గురైనా, నిలదొక్కుకున్నాం..' అంటూనే, అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.. అంతలోనే బుకాయించేశారు కేఈ కృష్ణమూర్తి. 

టీడీపీ సీనియర్‌ నేత కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు మీదనే, ఇప్పుడు పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్‌ నారాయణరెడ్డి హత్యకేసులో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 'కేఈ కృష్ణమూర్తి తనయుడే నారాయణరెడ్డి చంపించారు..' అంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేరకు గవర్నర్‌ని కలిసి, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు కూడా చేశారు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే.! 

కొన్నేళ్ళ క్రితం టీడీపీ నేత పరిటాల రవి హత్య జరిగింది. అది ఫ్యాక్షన్‌ రాజకీయ హత్య. కేవలం ఫ్యాక్షన్‌ గొడవలే ఆ హత్యకు కారణం కాదు, అంతకు మించిన రాజకీయ కారణాలూ ఈ హత్యలో అత్యంత కీలకం. పరిటాల రవిదే మొదలు కాదు.. ఇప్పుడు నారాయణరెడ్డిదే ఆఖరు కాదు.. ఈ ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అసలు అంతమే లేదు. ప్రతిసారీ అధికారంలో వున్నఆరు చెప్పే కథ ఒక్కటే, 'చట్టం తన పని తాను చేసుకుపోతుంది' అని. 

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా.? లేదా.? అన్నది ఆయా కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయా.? లేదా.? అన్నదానిపై ఆధారపడి వుంటుంది. ఆ కథేంటో జనానికి బాగా తెలుసు. అదే సమయంలో, ఈ హత్యల పరంపర ఎలా కొనసాగుతోంది.? అన్నదానిపైనా జనానికి ఓ ఐడియా వుంది. 'ముఖ్యమంత్రిగారు ఎంతో పెద్ద మనసుతో పత్తికొండ బాధ్యతల్ని నా కుమారుడికి అప్పగించారు..' అని కేఈ కృష్ణమూర్తి సెలవిచ్చారు. పార్టీని బలోపేతం చేయడానికి, ప్రత్యర్థుల్ని ప్రలోభపెట్టడమో, మట్టుబెట్టడమో చేయాలన్న 'రాజకీయ వ్యూహం' ఇక్కడ పనిచేసిందనుకోవాలా.? కేఈ కృష్ణమూర్తి ఈ రోజు మీడియా ముందుకొచ్చి చెప్పిన 'కథ'లోనే అసలక్కడ ఏం జరిగిందనే విషయమ్మీద స్పష్టత వుంది. అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత 'వాస్తవం' కన్పిస్తుందక్కడ.

Show comments