అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డదిడ్డంగా అక్రమాస్తులు కూడబెట్టారన్నది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మీద దాదాపు రెండు దశాబ్దాల క్రితం నమోదైన కేసు. ఈ కేసులో రెండు సార్లు జయలలిత దోషిగా తేలారు. ఆ రెండు సార్లూ ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత కేసు నుంచి బయటపడి, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇది అందరికీ తెల్సిన విషయమే.
తాజాగా న్యాయస్థానం ఈ కేసులో కీలకమైన తీర్పునిచ్చింది. జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసన్.. ఈ నలుగురూ దోషులేనని తేల్చింది. జయలలిత జీవించి లేరుగనుక, మిగిలిన ముగ్గురూ దోషులవుతారు. ఇంకేముంది, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న శశికళకు 'దారి' మూసుకుపోయింది. నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుందామె. నాలుగు వారాల్లో ఆమె సహా, మిగతా ఇద్దరూ లొంగిపోవాల్సిందే.
శశికళకు శిక్ష పడటంపై తమిళనాడు ఆపద్ధరమ్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పండగ చేసుకుంటున్నారు. 'శశికళ దోషిగా తేలారు.. తమిళనాడు రక్షించబడింది..' అంటూ పన్నీర్ సెల్వం వర్గం సోషల్ మీడియాలో ట్వీట్లతో హోరెత్తించేస్తోంది.
కాస్సేపు నైతికత గురించి మాట్లాడుకుందాం. అక్రమాస్తుల కేసులో జయలలిత దోషిగా తేలారు. ఆమె నుంచి వారసత్వంగా ముఖ్యమంత్రి పదవిని అందుకున్న పన్నీర్ సెల్వం, ఇప్పుడు జయలలిత దోషిగా తేలిన దరిమిలా, ఆమె అనుభవించాల్సిన శిక్ష కూడా అనుభవించాలి కదా.. అప్పుడే నైతికత అన్న మాటకు అర్థం వుంటుంది. 'అమ్మ ఆత్మ నాతో మాట్లాడింది..' అంటూ బోల్డంత కన్నీరు కూడా కార్చేసిన పన్నీర్ సెల్వం, జయలలిత సహా శశికళ, మరో ఇద్దరు అక్రమాస్తుల కేసులో దోషిగా తేలితే పండగ చేసుకోవడమేంటట.? ఇదే మరి రాజకీయం అంటే.