అశోక్ బాబు సీన్ ముగుస్తోందా?

సమైక్య ఆంధ్ర ఉద్యమ సమయంలో ఓవర్ నైట్ హీరో అయిపోయారు ఎన్జీవో నాయకుడు పరుచూరి అశోక్ బాబు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బ్యాకెండ్ లో వుండి అందించిన అండ దండలతో ఆయన పైకి ఎదిగారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి, చంద్రబాబుకు అనుకూలంగా మారారు. చంద్రబాబు విజయానికి యధాశక్తి సహరించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. 

ఎప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అప్పటి నుంచి ఇక అశోక్ బాబు దాదాపు సైలెంట్ అయిపోయారు.  అమరావతికి తరలింపు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాలు తాను తీసుకుంది కానీ, ఇందులో ఉద్యోగ సంఘాలకు పెద్దగా ప్రమేయం లేదు. అలాగే ఉద్యోగులపై వివిధ సందర్భాల్లో జరిగిన దాడులను కూడా ఉద్యోగ సంఘాలు పెద్దగా ప్రతిఘటించలేకపోయాయి.

పైగా ఎప్పటికప్పుడు పరిష్కారం కావాల్సిన సమస్యలు వుండనే వున్నాయి. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. అందుకే అశోక్ బాబుపై మిగిలిన ఉద్యోగ సంఘాలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నాయి. అశోక్ బాబు పిలుపునిచ్చే సంయుక్త సమావేశాలకు డుమ్మా కొడుతున్నాయని ఈ రోజు వివిధ దినపత్రికలు వార్తలు అందించాయి. ఇప్పుడు చంద్రబాబుకు రెండే ఆప్షన్లు. 

అధికారం ద్వారా వివిధ యూనియన్ ల నాయకులను కంట్రోల్ చేసి, ప్రస్తుతానికి అశోక్ బాబుకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం. లేదా అశోక్ బాబు సీన్ అయిపోతోందని గమనించి, గమ్మున వుండడం. సాధారణంగా అవసరం తీరిపోయాక, చంద్రబాబు ఎవర్నీ ఎక్కువ కాలం భరించరు. ఆ లెక్కన అశోక్ బాబుకు కష్టమే మరి. Readmore!

Show comments