ఇదేం పాలన అయ్యన్నా....!

నవ్యాంధ్రలో అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మధ్య ఏ మాత్రం తేడా లేకుండా చంద్రబాబు పరిపాలన చేస్తున్నారు. మరి, ఆ పార్టీలో సీనియర్లు, మంత్రులు సైతం అదే బాటన పయనించేందుకు ఆత్రపడుతున్నారు. ప్రభుత్వం అంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే అన్న భావనలో మంత్రి మహాశయులు తరించిపోతున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్‌ మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజాగా చేసిన ఓ ప్రకటన అందుకు నిదర్శనం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నర్శీపట్నం నియోజకవర్గంలో గత నెలలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై అయ్యన్న కించిత్‌ ఆగ్రహంగా ఉన్నారు. 

సరిగ్గా సభ్యత్వం జరగలేదన్న బాధలో ఉన్న అయ్యన్న తెలుగుదేశం సభ్యత్వం పెద్దగా లేని గ్రామ పంచాయతీలకు నిధులలో కోత పెడతామని అధికారుల సమావేశంలోనే హెచ్చరించడం విశేషం. ఇందుకు గానూ మార్గదర్శకాలను కూడా ఆయన ప్రకటించేశారు. ఏ గ్రామంలో అయితే 200 లోపు టీడీపీ సభ్యత్వాలు ఉంటాయో ఆ గ్రామానికి పది లక్షల లోపే నిధులను ఇస్తామని కూడా పేర్కొన్నారు.  ఇక 300 వరకూ సభ్యత్వాలు ఉన్న గ్రామ పంచాయతీలకు ఇరవై లక్షలు, ఆ పైన బాగా సభ్యత్వాలు ఉన్న గ్రామాలకు అధికంగా నిధులను ఇస్తామని స్వయంగా మంత్రివర్యులే చెప్పడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది.

గ్రామాలలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అసలు లేకుండా ఉంటే నిధులను ఇవ్వబోమని  మంత్రి స్ధాయిలో వ్యక్తులు చెప్పడం ఎంతవరకూ సమంజసమన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. నిత్యం వివాదాస్పద ప్రకటనలతో కాలక్షేపం చేసే మంత్రిగారు ఈసారి ఇలా పార్టీ కార్యకర్తలు ఉంటేనే గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తామని చెప్పడం ధర్మమేనా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. 

ప్రభుత్వంలో మంత్రిగా చేరాక పార్టీలకు అతీతంగా అందరినీ ఒక్కటిగా చూడాల్సిన మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తరువాత సొంత రాజ్యాంగాలు, పార్టీ సిద్ధాంతాల మేరకు పనిచేస్తామని చెప్పడం ఏ రకమైన ప్రజాస్వామ్యమో ఆయనే చెప్పాలని విపక్షాలు అంటున్నాయి. మొత్తానికి గ్రామాలలో టీడీపీ సభ్యత్వాలు పెరగడానికి ఏమేం చేయాలో విశాఖ జిల్లా స్ధాయిలో మంత్రి అయ్యన్న చెప్పేశారు. దానిని ఆంధ్రప్రదేశ్‌ అంతటా అమలుచేయడం ఆయన పార్టీ పెద్ద, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులలో ఉంది.  Readmore!

Show comments