2 లక్షల 25 వేల కోట్లు: వెంకయ్య కథ

విన్నారా ఈ విడ్డూరం.? ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇచ్చిన, ఇవ్వబోతున్న ప్రత్యేక ప్యాకేజీ మొత్తం విలువ అక్షరాలా 2 లక్షల 25 వేల కోట్ల రూపాయలు. ఇందులో 1 లక్ష 65 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం అమల్లోకి తెచ్చిందట. అదెలా.? అనడక్కండి. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌కి 'నేనే దిక్కు' అని చెప్పుకునే రాజకీయ కురువృద్ధుడు వెంకయ్య చెబుతున్న కథ ఇది. 

అప్పుడెప్పుడో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్‌కి రహదారి ప్రాజెక్టుల కోసం ప్రకటించిన 65 వేల కోట్ల రూపాయలు కూడా ఇందులో భాగమే. ఇంతేనా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విస్తరణకు కేటాయించే 38 వేల కోట్ల రూపాయల్ని కూడా ఇందులోనే కలిపేశారు. ఎయిమ్స్‌, ఐఐటీ, ఇంకోటీ.. మరోటీ.. అన్నిటికీ కలగలిపేసి.. ఏకంగా గంటకి పైగా సమయం తీసుకుని, వెంకయ్యనాయుడు కేంద్రం అందించింది.. అందించబోతోంది.. అంటూ ప్యాకేజీ వివరాల్ని ఏకరువు పెట్టేశారు. 

ఇవన్నీ ఎందుకు.? ప్రత్యేక హోదా పదేళ్ళని అన్నారు కదా, దాన్ని తేల్చమని అడిగితే. ఫలానా పుల్లయ్య, ఇంకో రంగయ్య ప్రత్యేక హోదాకి అడ్డుతగులుతారంటూ కొత్త కథ విన్పించారు వెంకయ్యనాయుడు. ఐఐటీ సరే, ఎయిమ్స్‌ సరే.. ప్రత్యేక రైల్వే జోన్‌ మాటేమిటి.? అనడిగితే, దానికీ సరైన సమాధానం వుండదు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఆ వివరాల్ని చెబుతారట. పోలవరం ప్రాజెక్టు ఏమయ్యిందయ్యా.? అనడిగితే, 1982లో ప్రారంభమైన ఆ ప్రాజెక్ట్‌, ఇప్పటిదాకా నిర్మితం కాలేదనీ, తాము అధికారంలోకి వచ్చి రెండేళ్ళు మాత్రమే అయ్యిందంటూ ఇంకో కథ వినిపించారు వెంకయ్య. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వెంకయ్య ఈగ కూడా వాలనిచ్చేలా కనిపించలేదు. 'చంద్రబాబు రాజీనామా చెయ్యాలా.? నాన్సెన్స్‌..' అంటూ విరుచుకుపడిపోయారు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షం మీద. చంద్రబాబుని వైఎస్సార్సీపీ విమర్శిస్తే, వెంకయ్యకెందుకో ఆగ్రహం.? కేంద్రం తీరుపై తన రక్తం మరిగిపోయిందని ఇదే చంద్రబాబు విమర్శించినప్పుడు వెంకయ్య ఏమయ్యారట.? రామకోటయ్య తదితరులు చంద్రబాబుని విమర్శించినప్పుడు వెంకయ్య ఏం చేశారట.?  Readmore!

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు.. ఇదీ వెంకయ్య తాజా 'బొంకు'. ప్రత్యేక హోదా అడిగిందెవరు.? ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిందెవరు.? ఇప్పుడు మాట తప్పింది, మడమ తిప్పింది ఎవరు.? వెంకయ్యగారూ కాస్త ఆన్సర్‌ ప్లీజ్‌. 

అవును మరి, ఎయిమ్స్‌ ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వుంది.. కొత్తగా దేశంలో ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు.. రహదారి ప్రాజెక్టులు దేశంలో ఏ రాష్ట్రానికీ లేకుండా ఆంధ్రప్రదేశ్‌కే ఇస్తున్నారు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న వెంకయ్యనాయుడు ఇంతలా బొంకేయడం నూటికి నూరుపాళ్ళూ హాస్యాస్పదమే. వెంకయ్యగారూ ఎవరికి చెబుతారు కట్టు కథలు.?

ప్రధానమంత్రి హోదాలో రాజ్యసభ సాక్షిగా మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకే దిక్కు లేదు. వెంకయ్యగారో, అరుణ్ జైట్లీగారో ప్రెస్ మీట్ పెట్టి కథలు చెబితే నమ్మేదెలా?

Show comments

Related Stories :