బీకామ్‌లో ఫిజిక్స్‌.. తెలివితేటలంతే మరి.!

బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివినోళ్ళ తెలివితేటలెలా వుంటాయ్‌.? ఆ తెలివితేటల గురించి కొత్తగా మాట్లాడుకోవడానికేముంటుంది.? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేశారో ఎమ్మెల్యేగారు. ఆయనగారి పేరే జలీల్‌ఖాన్‌. పరిచయం అక్కర్లేదీయనగారి గురించి. బీకామ్‌ - ఫిజిక్స్‌ అని గూగుల్‌లో సెర్చ్‌ కొడితే చాలు, కుప్పలు తెప్పలుగా ఫొటోలు, వీడియోలు, న్యూస్‌ ఆర్టికల్స్‌ దర్శనమిస్తాయి. తెలుగునేలకి అంతగా పాపులారిటీ తెచ్చిపెట్టేశాడాయన.! 

ఇప్పుడీయనగారు మళ్ళీ వార్తల్లోకెక్కారు. 'జగన్‌ గనుక దురదృష్టవశాత్తూ ముఖ్యమంత్రి అయితే..' అంటూ విరుచుకుపడిపోయారు. 'నంద్యాలకి వెళ్ళి జగన్‌ ఏం చేస్తారు.? నెత్తిమీద చెయ్యేసి, ముద్దులు పెడతారు..' అంటూ వెటకారం చేసేశారు జలీల్‌ఖాన్‌. బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివితే, ఇంతకన్నా 'తిన్నగా' విమర్శలు చేయడమెలా వస్తుంది.? 

అన్నట్టు, జలీల్‌ఖాన్‌ 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారండోయ్‌.! మరి, జగన్‌ని ఎలా విమర్శిస్తున్నారట.? పార్టీ ఫిరాయించిన నేతకి, తనను ఎమ్మెల్యేని చేసిన జగన్‌ని విమర్శించే నైతిక హక్కు ఎలా వుంటుందట.? అలా ఎవరూ ఆయనగార్ని ప్రశ్నించకూడదంతే.! ప్రశ్నించారో, ఈసారి బీకామ్‌లో ఫిజిక్స్‌ తరహాలో మరో బాంబు పేల్చి, తెలుగు నేల పరువు తీసేసినా తీసేస్తారు. 

నంద్యాల ఉప ఎన్నిక వేళ, తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడంలేదు. ఆఖరికి జలీల్‌ఖాన్‌తోనూ జగన్‌పైన విమర్శలు చేయించేస్తోంది. బీకామ్‌లో ఫిజిక్స్‌ చేశానని చెప్పుకున్న వ్యక్తికి రాజకీయాల్లో విలువెంత.? అన్న ఇంగితం కూడా టీడీపీకి లేకపోవడం ఆశ్చర్యకరమే.

Show comments