'కాటమరాయుడు' పవర్‌ పాలిటిక్స్‌

ఎట్టకేలకు పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కాటమరాయుడు' సెట్స్‌ మీదకు వెళుతోంది. ఈ నెల 20 నుంచి సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. 24వ తేదీ నుంచి పవన్‌కళ్యాణ్‌ షూటింగ్‌కి హాజరవుతారు. 'గబ్బర్‌సింగ్‌' తర్వాత పవన్‌కళ్యాణ్‌తో శృతిహాసన్‌ ఈ చిత్రంలో మరోమారు ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయబోతోంది. 'గోపాల గోపాల' ఫేం కిషోర్‌ కుమార్‌ పార్దసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరద్‌మరార్‌ నిర్మాత. 

ఇక, ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి వున్నా, అసలు సినిమా పట్టాలెక్కుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో బాలారిష్టాలు ఎలాగైతేనేం కొంతవరకు దాటిందనే చెప్పాలి. శరవేగంగా సినిమాని పూర్తి చేయాలని ప్రస్తుతానికైతే పవన్‌కళ్యాణ్‌ ఆదేశాలు జారీ చేసినా, పవన్‌కళ్యాణ్‌ ఎంతవరకు ఆ దిశగా చిత్ర దర్శక నిర్మాతలకు సహకరిస్తాడన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే పవన్‌కళ్యాణ్‌, రాజకీయాల్లో గట్టిగానే ఈసారి అడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు గనుక. 

ఇదిలా వుంతే, ఈ సినిమాకి కాస్త పొలిటికల్‌ కలర్‌ కూడా అద్దనున్నారట. జనసేన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు 'నేను మనం జనం' (మార్పుకోసం యుద్ధం) అనే పుస్తకం రాస్తున్న పవన్‌కళ్యాణ్‌, ఆ పుస్తకంతోపాటుగా, సినిమాలోనూ పొలిటికల్‌ పంచ్‌ డైలాగులు పేల్చనున్నాడనీ, ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు డాలీకి కొన్ని ఇన్‌పుట్స్‌ ఇచ్చాడనీ తెలుస్తోంది. దీన్ని 'వేలు పెట్టడం' అనాలా.? ఇంకేమన్నా అనాలా.? అన్నది వేరే విషయం. 

వాస్తవానికి ఈ సినిమా ముందుగా ఎస్‌జె సూర్య దర్శకత్వంలో ప్రారంభమయ్యింది. ఆ తర్వాత ఎస్‌జె సూర్యని తప్పించి, డాలీని పవన్‌కళ్యాణ్‌ రంగంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో డాలీ మీద పవన్‌ తన జనసేన భావజాలాన్ని రుద్దాలనుకుంటే, సినిమా పక్కాగా తెరకెక్కుతుందా.? వేచి చూడాల్సిందే. 

Show comments