దివ్య స్పందన అలియాస్ రమ్య.. కాంగ్రెస్ నేత, పైగా గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఆమె సొంతం. ప్రస్తుతం రాజకీయాల్లోనే వున్నా, సినిమాల్లో కూడా బిజీ అవ్వాలనుకుంటోన్న రమ్య, ఇటీవలే వచ్చిన 'నాగాభరణం' సినిమాలో నటించిన విషయం విదితమే. తాజాగా, ఆమె నిర్మాతగా మారబోతోందట. ఓ పొలిటికల్ సెటైర్ తెరకెక్కించే దిశగా రమ్య, పలువురు దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతోందని గుసగుసలు విన్పిస్తున్నాయి.
రమ్య కన్నడ నటి. తమిళ, తెలుగు సినిమాల్లో కూడా నటించిందామె. దాంతో, ఆమె త్రిభాషా చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోందట. కాంగ్రెస్ నేతగా, 2019 ఎన్నికల కోసం ఇప్పటినుంచే సనద్నధమవుతోన్న రమ్య, తన పొలిటికల్ కెరీర్‌కి ప్లస్ అయ్యేలా పొలిటికల్ మూవీ తీయాలనే ఆలోచనతోనే, ఇంత పెద్ద రిస్క్ చేసేస్తోందని కన్నడ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.
చిన్న వయసులోనే ఎంపీ అవడమే కాకుండా, తక్కువ సమయంలోనే ఆ ఎంపీ పదవిని కోల్పోయింది రమ్య. ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడమే అందుక్కారణం. అయినాసరే, రమ్య తనకు సినీ నటిగా వున్న ఫాలోయింగ్‌తో, ఆ ఫాలోయింగ్‌ని రాజకీయాల్లోనూ ఎంతో కొంత కొనసాగించుకోగలిగింది. ఇప్పుడీ సెటైరికల్ పొలిటికల్ మూవీ ఆలోచనలతో, అటు పొలిటికల్‌గా.. ఇటు సినిమా పరంగా రమ్య తన ఇమేజ్‌ని పెంచుకోగలుగుతుందా.? వేచి చూడాల్సిందే.