సిగ్గుపడాల్సింది పోయి.. ఈ అక్కసేంటి జేసీ!

రూపాయి కిలో బియ్యంపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యానాలు చేశాడు. క్వార్టర్ కొట్టడానికి రోజూ వంద రూపాయలు ఖర్చు పెడతారు.. మీకు రూపాయికే బియ్యం అవసరమా? అని దివాకర్ రెడ్డి సామాన్యులను, రేషన్ కార్డు హోల్డర్లను ప్రశ్నించాడు.రోజుకు ఐదారు టీలు తాగుతారు, ఒక బీడీ కట్ట ఊదేస్తారు.. మీకు రూపాయికే కిలో బియ్యం కావాలా? అంటూ దివాకర్ రెడ్డి అక్కసు వెల్లగక్కాడు.

మరి రూపాయి కిలో బియ్యానికి సొమ్ములను జేసీ తన ఇంటి నుంచి తెచ్చివ్వడం లేదని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన లేదు. ఈ విషయం లో ఈయన ఏడుపేంటో అర్థం కావడంలా! రూపాయికే కిలో ఇస్తున్నబియ్యం నాణ్యత ఎంత? వాటితో పూట గడుపుకుంటున్న పేదల పరిస్థితి ఏమిటి? ప్రతివాడూ ఈ తాగి తందనాలు ఆడుతుంటారా? ఈ విషయాలపై జేసీకి అవగాహన ఉందో లేదో కానీ.. ఈయన ఏడుపును చూశాకా కొన్ని విషయాలను తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి.

పేదలకు ఇస్తున్న రూపాయి బియ్యం విషయంలో ఇన్ని లాజిక్కులు మాట్లాడుతున్న జేసీ.. ప్రభుత్వ సొమ్ముతో తమ బోటి ఎంపీలు చేస్తున్న జల్సాలు, పొందుతున్న సౌకర్యాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు. రూపాయి కి బియ్యం ఇస్తున్నారనే ఇంతగా ఏడుస్తున్నారు.. మరి పార్లమెంటు క్యాంటీన్ లో అతి చవక ధరలకు తింటున్నారు కదా ఎంపీలు? మీ లాంటి వాళ్లకు దక్కుతున్న సబ్సిడీల కథలు విని… భారతదేశమే నివ్వెరపోతోంది కదా!

జేసీ కూడా ఎంపీనే. ఇలాంటి వారికి అలాంటి సబ్సిడీలతో క్యాంటీన్లు ఉండాలా? పార్లమెంటు క్యాంటీన్ నిర్వహణకే ఏడాదికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా.. మంది సొమ్ముపై ఆధారపడి అలా బతకడానికి సిగ్గేయడం లేదా? రూపాయి బియ్యం తీసుకుంటున్న జనాలను ప్రశ్నిస్తున్న జేసీ లాంటి వాళ్లు దమ్ముంటే.. తాము పొందుతున్న సబ్సిడీల గురించి స్పందించాలి.

ఇలాంటి మాటలనే లోక్ సభలో మాట్లాడాలి. అలా మాట్లాడలేనప్పుడు.. పేదలను ప్రశ్నించే అర్హత, వారిపై అనుచిత వ్యాక్యానాలు చేసే అర్హత జేసీలాంటి పెద్ద మనుషులకు లేదు. కేవలం క్యాంటీన్ అనే కాదు… ఎంపీల హోదాల్లోని ఇలాంటి వాళ్లు పొందుతున్న సబ్సిడీలు, రాయితీలన్నింటినీ ఏకరువు పెడితే…  దేశానికి భారం పేదలు కాదు, ఇలాంటి ఎంపీలే అని స్పష్టం అవుతుంది. మరి దానికి సిగ్గుపడాల్సింది పోయి.. జనాల మీద నీ ఏడుపేంది జేసీ!

Show comments