ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్ అధికారులు, ప్రధానంగా మహిళా ఐఏఎస్ లు తీవ్రస్థాయిలో అసూయపడుతున్నారుట! పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో... దృఢంగా నిర్భయంగా నిక్కచ్చిగా వ్యవహరించగల ముఖ్యమంత్రి తమకు లేకుండా పోయాడే అని కుమిలిపోతున్నారట. తమ మీద నాయకులు దౌర్జన్యాలకు దిగితే.. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకే అక్షింతలు వేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదని, అదే పొరుగు రాష్ట్రం తెలంగాణలో అయితే.. కేసీఆర్ దౌర్జన్యానికి గురైన అధికార్లకు దన్నుగా నిలిచి, సొంత పార్టీ నాయకులే అయినా.. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని తలపోస్తున్నారట.
తాజాగా తెలంగాణ మహబూబాబాద్ కలెక్టరు పట్ల ఓ ఎమ్మెల్యే అనుచితంగా వ్యవహరించిన తీరు, తదనంతర పరిణామాల్లో ఆ ఎపిసోడ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ డీల్ చేస్తున్న తీరు పట్ల ఏపీలోని అధికారులు, ప్రధానంగా మహిళా ఐఏఎస్ లు ముగ్ధులైపోతున్నట్ల అమరావతి సచివాలయంలో సర్వత్రా చెప్పుకుంటున్నారు.
గతంలో ఏపీలో అధికార్ల మీద అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు లెక్కకు మిక్కిలిగా జరిగాయి. వనజాక్షి విషయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రౌడీకంటె దిగజారి వ్యవహరించినప్పటికీ.. చంద్రబాబు ఆ విషయంలో ఎంత అసమర్థంగా స్పందించారో అందరికీ తెలుసు. వనజాక్షి మీద ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం చేస్తే.. చంద్రబాబునాయుడు మళ్లీ ఆమెకే స్పెషల్ క్లాసు తీసుకున్నారు.
అంతే తప్ప.. ఎమ్మెల్యే మీద వీసమెత్తు చర్య తీసుకోలేదు. కేవలం అదొక్కటే కాదు.. అధికార అహంకారంతో కళ్లు మూసుకుపోయిన తెలుగుదేశం నాయకులు చాలా చోట్ల అధికార్ల మీద దురుసుగా ప్రవర్తించినా... దౌర్జన్యాలు చేసినా.. చంద్రబాబు వారి మీద తీసుకున్న చర్యలు శూన్యం.
అదే సమయంలో.. మహబూబాబాద్ కలెక్టరు పట్ల ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించారనే సంగతి బయటకు రాగానే.. కేసీఆర్ స్పందించిన వైనంచూసి అధికారులు గర్విస్తున్నారు. కలెక్టరును ఎమ్మెల్యే నెట్టేయడం అనేది కావాలని చేసినదో... అనుకోకుండా జరిగినదో తర్వాతి సంగతి. కానీ కేసీఆర్ అదే రోజున ఎమ్మెల్యేతో ఆమెకు క్షమాపణ చెప్పించారు.
తీవ్రస్థాయిలోనే మందలించినట్లు వార్తలు వచ్చాయి. గురువారం నాడు ఐఏఎస్ లంతా మళ్లీ సమావేశం అయ్యే సమయానికి, కేసీఆర్ ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కబురు పెట్టి మళ్లీ పిలిపించారు. అధికార్లు మనస్తాపానికి గురికాకుండా, నొచ్చుకోకుండా తాను చేయగలిగిన అన్ని చర్యలూ తీసుకున్నారు.
కేసీఆర్‌కు ఉన్నపాటి ధైర్యం, తెగువ, దృఢత్వం తమ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేకుండా పోయాయనేది ఏపీలోని అధికార్ల వాదనగా ఇప్పుడు మారింది. పార్టీ మీద ఎమ్మెల్యేల మీద కేసీఆర్‌కు పట్టు ఉన్నదని అందుకే ఆయన నిక్కచ్చిగా ఉండగలుగుతున్నారని, చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా పల్లెత్తు మాట అనలేని దయనీయమైన స్థితిలో ఉన్నారని అంతా అనుకుంటున్నారు.