బాబు..బేటా..వాటె ప్లాన్

తేదేపా ఎమ్మెల్యేలతో చినబాబు నారా లోకేష్ ఫేస్ టు ఫేస్..ప్రతి ఒక్కరితో నేరుగా వీలయినంత ఎక్కువ సేపు ముచ్చటించి, పార్టీ నిర్వహించిన సర్వేలో వారికి వచ్చిన మార్కులు, ఏం చేయాలి, ఎలా చేయాలి వంటివి అన్నీ డిస్కస్ చేస్తారు. కానీ ఇవన్నీ చేయాల్సింది చంద్రబాబు కదా? ఎందుకంటే ఎమ్మెల్యేల పనితీరు అన్నది ముఖ్యమంత్రికి సంబంధించినది. ఆయన కదా సమీక్షించాల్సింది. కానీ దానికి బాబు తరపున వకాల్తా పుచ్చుకుని వార్తలు రాసేవారి సమాధానం ఏమిటి? 

బాబుగారు బాగా బిజీగా వున్నారు. ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి అంత టైమ్ కేటాయించలేరు కనుక అని. పాపం ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా బిజీగా వుండి, సతీమణి లక్ష్మీ పార్వతికి కొన్ని పనులు అప్పగించి వుంటారని అప్పట్లో ఎందుకు అనుకోలేదో? అటపక్క నుంచి చూస్తే రాజ్యాంగేతర శక్తి, ఇటు పక్కనుంచి చూస్తే తండ్రికి చేదోడు వాదోడు. సరే ఆ సంగతి అలా వుంచేద్దాం.

ఇంతకీ ఎమ్మెల్యేలతో పెదబాబుకు బదులు చినబాబు బేటీ వేయడం వెనుక చాలా పెద్ద వ్యూహమే వుందని పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటి సారాంశం ఇలా వుంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటేసింది. మంత్రివర్గ మార్పులు చేర్పుల ఊసు లేదు. అప్పట్లో బాబు బాజా మీడియా ఏమంది.. ఏడాదిన్నర రెండేళ్ల తరువాత రొటేషన్ పద్దతిలో అందరికీ మంత్రి పదవులు వస్తాయని. ఆ విధంగా పదవులు రాని వారిలో అసంతృప్తి పెరగకుండా చల్లార్చింది. పోనీ ఆ తరువాత కీలకమైన నామినేటెడ్ పోస్టులైనా పూర్తిగా భర్తీ చేసారా అంటే అదీ లేదు. వర్గ ప్రయోజనాల ఈక్వేషన్ల లెక్కల్లో భాగంగా కొన్ని భర్తీ చేసారు. కొందరికి అవకాశం లభించింది. ఇంకా చాలా చకోర పక్షులు అలాగే వున్నాయి. 

ఇదిలా వుంటే చాలా నియోజకవర్గాల్లో వైకాపా నుంచి జనాలను తీసుకువచ్చి డంప్ చేసారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వాల్ల భయాలు వాళ్లకు వున్నాయి. అసలు ఈ సర్వేలు, సన్నాయి నొక్కులు అన్నీ అందుకోసమే అని చిన్న అనుమానాలు కూడా వున్నాయి. సో, అసలు తమ పరిస్థితి ఏమిటి? అని ఎమ్మెల్యేలు కొంచెమయినా తెలుసుకోవాలనుకుంటారు. నియోజకవర్గంలో సమస్య ఇదీ అని చెప్పే అవకాశం వుంది. 

ఇలా ఈ రెండు విషయాలు నేరుగా బాబు దగ్గర ప్రస్తావిస్తే, ఆయన సమాధానం చెప్పాల్సి వుంటుంది. అదే చినబాబు దగ్గర ప్రస్తావిస్తే... ''..అవునా, అలాగా, బాబు గారితో మాట్లాడతాను..'' అని స్మూత్ గా తప్పుకోవచ్చు. 

ఇక అన్నింటికంటే కీలకమైన పాయింట్ బాబు కనుక నేరుగా ఇంటరాక్ట్ అయితే చిరుబుర్రులాడితే, ఎమ్మెల్యేలు ఫీలయ్యే ప్రమాదం వుంది. అదే చినబాబు సర్వే ఫలితాలు ఇలా అఘోరించాయి అని అన్నారు అనుకుందాం, ఎమ్మెల్యేలకు పెదబాబు దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు..అప్పుడు పెదబాబు 'నేనున్నాగా' అని అని సముదాయించవచ్చు. 

సో ఇలా, పెదబాబు, చినబాబు ఎమ్మెల్యేలను ఆశల వర్షంలో ముంచుతూ, సర్వేల ఎండలో ఆరబెడుతూ అయిదేళ్లు పదవుల పంపిణీ చేయకుండా, అసంతృప్తి ప్రబల కుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగిపోవచ్చు.

Show comments