నిజామును వదలని లౌకికవాది..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలాకాలం తరువాత కాంగ్రెసు పార్టీని చీల్చిచెండాడారు. విపరీతంగా దుమ్మెతిపోశారు. నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టారు. 'తెలంగాణ పిశాచి కాంగ్రెసు' అని తన అక్కసు వెళ్లగక్కారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్రావారిని ఇన్ని తిట్లు తిట్టివుండరు. ఆంధ్రజ్యోతి పత్రిక మెయిన్‌ ఎడిషన్లో రెండున్నర పేజీల కవరేజ్‌ ఇచ్చారంటే కేసీఆర్‌ ఆగ్రహానికి ఉన్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. నిన్న రెండు గంటలకు పైగా జరిగిన ప్రెస్‌మీట్లో మీడియాకూ ఆయన చురకలు అంటించారు కాబట్టి టీడీపీ అనుకూల పత్రిక ఇంత కవరేజ్‌ ఇచ్చిందనుకోవాలి. సరే... ఆ విషయం అలా ఉంచితే నిజాం ప్రభువును విపరీతంగా అభిమానించే (నిజం అభిమానమా? ముస్లిం ఓట్ల కోసం అభిమానమా?) కేసీఆర్‌ మరోసారి దాన్ని దాచుకోకుండా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో విదేశీ నిర్మాణ కంపెనీలతో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వగైరా భవనాల డిజైన్లు తయారుచేయిస్తున్నారు. దాంట్లో తెలుగు కల్చర్‌ ఉట్టిపడాలంటున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా కొత్తగా అసెంబ్లీ, సచివాలయం నిర్మించే పని మొదలుపెట్టబోతున్నారు.

ప్రస్తుతమున్న సచివాలయం, అసెంబ్లీ భవనాలు వాస్తురీత్యా పనికిరావని నిర్థారించకున్న ఈయన సికింద్రాబాదులో రక్షణ శాఖకు చెందిన స్థలం తీసుకుంటున్నారు. దాంట్లో అసెంబ్లీ, సచివాలయం కడతారట...! అయితే ఈ భవనాలన్నీ నిజాం రాచరిక పాలనలోని సంస్కృతిని ప్రతిబింబించేవిధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదే విషయం మీడియా సమావేశంలో చెప్పారు. ''తెలంగాణ ఏమైనా బికారి రాష్ట్రమా? లక్ష ఎకరాలు నిజాం నవాబు హైదరాబాదుకు ఇచ్చారు. ఎంత గొప్పగా కట్టాలె అసెంబ్లీని?'' అన్నారు. బాబుకు విదేశీ మోజైతే, కేసీఆర్‌ నిజాంపై మోజు. లక్ష ఎకరాలు నిజాం నవాబు ఇచ్చాడు కాబట్టి (ఏ నవాబో?) ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా అప్పటి సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించాలంటున్నారు కేసీఆర్‌. లక్ష ఎకరాలను నిజాం నవాబు సృష్టించి ఇచ్చాడా? అది ఆయన సొంత ఆస్తా? ఆయన జాగీరా? ఆయన లక్ష ఎకరాలు ఇవ్వడమేంటి? ఈయన ఆయన్ని గొప్ప దాతగా పొగడటమేమిటి? అరవై ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు నాశనమయ్యాయని, తెలంగాణ భాష, ఆటా పాటా కనుమరుగయ్యాయని సెంటిమెంటును దట్టించి ఉద్యమం నడిపిన కేసీఆర్‌ తెలంగాణ కల్చర్‌ను గాలికి వదిలేశారా? 

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, తెలంగాణ సెంటిమెంట్లను తెలియచెప్పేవిధంగా భవనాలు నిర్మించుకోవాలిగాని నిజాం పరిపాలనను, సంస్కృతిని గుర్తుకు తెచ్చే నిర్మాణాలెందుకు? 'నేను జీవితాంతం లౌకికవాదిగానే ఉంటాను' అని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఓ మతం ప్రజలను సంతృప్తిపరిచేందుకు, సంతోషపెట్టేందుకు వందల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారని అనుకోవాలి. ఉద్యమ నాయకుడిగా ఉన్న కాలంలోనూ నిజాం ప్రభువును ఎంతో ప్రశంసించారు. ముస్లింలకు ఆగ్రహం వస్తుందనే కారణంతోనే హైదరాబాద్‌ సంస్థాన విలీన దినోత్సవాన్ని నిర్వహించడంలేదు. ప్రతి ఏడాది సెప్టెంబరులో దీనిపై గొడవ జరగడం రివాజుగా మారింది. నిజాం గొప్పవాడని, ఆయన పాలన బ్రహ్మాండమని కేసీఆర్‌ మొదటి నుంచీ కీర్తిస్తున్నారంటే దానివెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఓసారి శాసనమండలిలో జరిగిన చర్చలో 'నిజామును కీర్తించొద్దు' అని అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ చెబితే, ఆ చరిత్రనంతా పాఠ్యపుస్తకాల్లో పెడతామని అప్పటి విద్యామంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. నిజాం చేసిన మంచి పనులు, అభివృద్ధితో పాటు ఆయన చేసిన పొరపాట్లు కూడా పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని జగదీశ్‌ రెడ్డి చెప్పారు. నిజాం అభివృద్ధి పనులు చేయలేదని ఎవరూ అనరు. నియంతలు కూడా మంచి పనులు చేసిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. అంతమాత్రాన వారిని కీర్తిస్తూ కూర్చుంటామా? ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజాంపాలన ఎలా ఉందో తెలియదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం  తెలియదు. నిజాం నిరంకుశత్వానికి, రైతాంగ పోరాటానికి వీరు ప్రత్యక్ష సాక్షి కాదు. కాని ఆ రెండింటినీ చూసినవారు, అనుభవించిన వారు తెలంగాణలో ఇప్పటికీ ఎందరో ఉన్నారు. అసలు చరిత్ర వారిని అడిగితే తెలుస్తుంది.

Show comments