నారాయణ నారాయణ.. పంచ్‌ పేలింది

సిపిఐ నేత నారాయణ స్టయిలే వేరు. ఎవరి మీద సెటైర్లు వేయాలన్నా, పంచ్‌ డైలాగులతో రెచ్చిపోవాలన్నా ఆయనకు సాటి ఇంకెవరూ రారేమో. ఒక్కోసారి ఆ పంచ్‌ డైలాగుల కోసం పడే ఆరాటం కాస్తా ఆయన్ను వివాదాల్లోకి లాగేస్తుంది. సిపిఐ నారాయణ అనడం కన్నా, ఆయన్ని చికెన్‌ నారాయణ అనడం సబబేమో. ఎందుకంటే ఆయనకి చికెన్‌ అంటే అంత ఇష్టం. అప్పుడెప్పుడో ఓ సారి గాంధీ జయంతి నాడు చికెన్‌ లాగించేసి, లెంపలేసుకున్నారాయన. 

ఇక, అసలు విషయానికొస్తే ఈసారి నారాయణ, పవన్‌కళ్యాణ్‌ మీద పంచ్‌ డైలాగులు పేల్చేశారు. 'చేతనైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా.. లేదంటే రజనీకాంత్‌లా ఓ మూల కూర్చో..' అంటూ నారాయణ విరుచుకుపడ్డారు. డ్యామిట్‌.. కథ అడ్డం తిరిగింది.. తనకు వామపక్షాలంటే ఇష్టమని పవన్‌కళ్యాణ్‌ చెప్పినా, పవన్‌కళ్యాణ్‌ని నారాయణ ఎందుకు విమర్శించారబ్బా.? 

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఎంతైనా, నారాయణకి టీడీపీ అధినేత చంద్రబాబంటే అదో ఇది. తిరుపతి బహిరంగ సభలో అంతలేసి మాటలతో చంద్రబాబుపై పవన్‌కళ్యాణ్‌ విరుచుకుపడేసరికి నారాయణకి కోపమొచ్చినట్టుంది. పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వస్తాడో రాడో.. అది వేరే విషయం. పార్టీ పెట్టాడుగానీ, ఆయన రాజకీయాల్లో వున్నాడని జనం అనుకోవట్లేదు. జస్ట్‌ షో చేస్తాడని మాత్రమే అనుకుంటున్నారు. ఈలోగా నారాయణే ఒకింత తొందరపడినట్టున్నారేమో.! 

అంతా బాగానే వుందిగానీ, పొంగే పాలల్లో ఉప్పు వేసే రకం.. అంటూ పవన్‌ని నారాయణ విమర్శించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలట.? ఇదొక్కటే కాదు, తన స్వార్ధం కోసం అభిమానుల్ని పవన్‌కళ్యాణ్‌ వాడుకుంటున్నారని నారాయణ ఆరోపించేశారు. అభిమానుల్ని సినీ హీరోలు వాడేసుకోవడం కొత్తేమీ కాదు. రాజకీయ నాయకులతో పోల్చితే కాస్తో కూస్తో సినిమా హీరోలే బెటర్‌. ఒకప్పటి వామపక్షాలు వేరు.. ఇప్పటి వామపక్షాలు వేరు. జనాన్ని రెచ్చగొట్టి, తుపాకీ గుళ్ళకి వారిని బలిపెట్టింది వామపక్షాలు కాదా.? సాక్ష్యం కావాలంటే ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే చాలా ఘటనలు కన్పిస్తాయి అలాంటివి.  Readmore!

ఏదిఏమైనా, పవన్‌కళ్యాణ్‌ బహిరంగ సభతో బాగానే రాజకీయ నాయకుల్ని కెలికేశారు. అందుకే చాలామంది గుస్సా అయిపోతున్నారు. అఫ్‌కోర్స్‌.. రేప్పొద్దున్న పవన్‌కళ్యాణ్‌ జాడ పొలిటికల్‌ తెరపై ఎవరికన్నా తెలుస్తుందా.? ఛాన్సే లేదు.. మళ్ళీ ఆయన ఏ ఏడాదికో రెండేళ్ళకో జూలు విదుల్చుతారు. అప్పటిదాకా రెస్ట్‌ తీసుకోవద్దూ.!

Show comments