'మెగా' సస్పెన్స్‌ వీడేదెప్పుడట

తొమ్మిదేళ్ళ విరామం తర్వాత చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'ఖైదీ నెంబర్‌ 150'. ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా టైమ్‌లో చెప్పిన చిరంజీవి, ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటేసినా, తదుపరి సినిమాని పట్టాలెక్కించలేదు. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా నిర్మించిన తన కుమారుడు చరణ్‌ నిర్మాతగానే, సొంత బ్యానర్‌ కొణిదెల ప్రొడక్షన్‌లోనే చిరంజీవి తదుపరి సినిమా పట్టాలెక్కనుంది. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా ప్రారంభం కావాల్సివుంది. 

చరణ్‌తో 'ధృవ' సినిమా చేసిన సురేందర్‌రెడ్డి, ఆ తర్వాతి నుంచి పూర్తిగా చిరంజీవితో చేయబోయే సినిమా మీదనే దృష్టిపెట్టాడు. కానీ, ఇంతవరకు చిరంజీవితో సురేందర్‌రెడ్డి చేయబోయే సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న దానిపై క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఆగస్ట్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుందని ఈ మధ్య పలు సందర్భాల్లో చరణ్‌ చెబుతూ వచ్చాడు. ఆగస్ట్‌ రానే వచ్చింది. ఆగస్ట్‌ 22న చిరంజీవి పుట్టినరోజు. ఆ రోజునే సినిమా ప్రారంభమవుతుందన్న ప్రచారమైతే జరుగుతోంది. 

తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నారు. నిజానికి ఇది ఇప్పటి మాటకాదు, ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం.. అంటే, చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళకముందు అనుకున్న సబ్జెక్ట్‌. అప్పట్లో పరుచూరి బ్రదర్స్‌ - వినాయక్‌ ఈ సినిమా కథ మీద చాలా వర్క్‌ చేశారు. ఇప్పుడు సురేందర్‌రెడ్డి వర్క్‌ చేస్తున్నాడంతే. ఇన్నేళ్ళ నిరీక్షణ తర్వాత ఈ ఆగస్ట్‌లో సినిమా పట్టాలెక్కడం నిజమేనా.? వేచి చూడాల్సిందే.

Show comments