బాహుబలికి ఆకాశమే హద్దు

'బాహుబలి' మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ స్థాయిలో సంచలనం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. అంచనాలకి మించి ఆడిన బాహుబలి తెలుగు సినిమా మార్కెట్‌కి కూడా ఇరవై నుంచి పాతిక కోట్ల బూస్ట్‌ ఇచ్చింది. భారీ చిత్రాలకి ఇప్పుడు ఎనభై కోట్ల పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరగడం పరిపాటి అయిపోయింది.

త్వరలో బాహుబలి రెండవ భాగం విడుదలకి సిద్ధమవుతోన్న దశలో తెలుగు సినిమా మార్కెట్‌ మునుపటి కంటే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. 'బాహుబలి 2' బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సంచలనాలు చేయగలదనే దానికి ఊహలు కూడా కష్టమే అనిపిస్తోంది. సినిమా ఎలా ఉన్నప్పటికీ తెలుగునుంచే రెండు వందల కోట్ల బిజినెస్‌ జరుగుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంచనాలని అందుకున్నా, వాటిని మించిపోయి రాజమౌళి మ్యాజిక్‌ జరిగినా ఇక కలెక్షన్ల ప్రవాహాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. ఈసారి బాలీవుడ్‌తో పాటు తమిళ వెర్షన్‌కి క్రేజ్‌ తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్‌ వసూలు చేసే తొలి భారతీయ చిత్రమవుతుందని ట్రేడ్‌ పండితులు లెక్కలేస్తున్నారు. అదే జరిగితే మొత్తం భారతీయ సినిమాకే 'బాహుబలి 2' ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోతుంది.

Show comments