ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆ హత్య ఓ పెను సంచలనం. ఓ రాజకీయ ప్రముఖుడి 'వారసుడు' ఓ మైనార్టీ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టి, అత్యంత కిరాతకంగా ఆమెను హత్య చేశాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అది కూడా, బాధిత యువతి హాస్టల్‌లో ఉండగా, దాడి జరగడం అప్పట్లో అందర్నీ విస్మయానికి గురిచేసింది. పక్కనే వేరే గదిలో వున్నవారెవరికీ ఆమె హత్య గురించి తెలియదంటే, ఇది 'మిస్టరీ కా బాప్' కాకుండా ఎలా వుంటుంది.?
చివరికి ఈ కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని నిందితుడిగా తేల్చారు. ఎనిమిదేళ్ళు సత్యంబాబు జైల్లో వున్నాడు. సత్యంబాబు కూడా, బాధిత యువతి అయేషా మీరాని తానెలా చంపిందీ స్పష్టంగా చెప్పాడు. కానీ, ఇప్పుడా సత్యంబాబు నిర్దోషి. హైకోర్టు, సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా, పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి జరీమానా విధించింది కూడా.!
ఇప్పుడు సత్యంబాబు బన్‌గయా సూపర్ స్టార్. మీడియాకెక్కి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఆ హత్య తాను చేయలేదంటున్నాడు. దేవుడు తన పక్షానే నిలిచాడని కాలర్ ఎగరేస్తున్నాడు. హైకోర్టు చెప్పింది కదా అని సత్యంబాబు నిర్దోషి అయిపోడు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే అక్కడ ఇంకో తీర్పు రావొచ్చు. విచారణాధికారి, అన్ని ఆధారాలతోనే సత్యంబాబుని దోషిగా గుర్తించామని చెప్పారు. పై కోర్టులో అప్పీల్ చేసే యోచనలోనూ వున్నామన్నారు.
మరి, సత్యంబాబు సూపర్ స్టార్ ఎలా అవుతాడు.? అన్న డౌట్ మీకొస్తే అది మీ తప్పు కాదు. సత్యంబాబు నేరస్తుడనడానికి తగిన ఆధారాల్ని పోలీసులు చూపలేకపోవడంతోనే అతను నిర్దోషి అయ్యాడు. అదే ఆధారాలు దొరికితేనో.! సల్మాన్‌ఖాన్ విషయంలో ఏం జరిగింది.? జయలలిత విషయంలో ఏం జరిగింది.? ఈ రెండు కేసుల్నీ తీసుకుంటే, సత్యంబాబుని నిర్దోషి అని గట్టిగా వాదించేయలేం.
కానీ, సత్యంబాబు సూపర్ స్టార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు సొంత ఇంటిని సమకూర్చే పనిలో వుంది. అంతే కాదు, సత్యంబాబుకి ఉద్యోగం (కాంట్రాక్ట్ బేస్డ్) ఇచ్చేందుకూ సుముఖత వ్యక్తం చేసింది. చాలా చిత్రంగా అన్పిస్తోంది కదూ.! అవునుమరి, దొంగతనం కేసో, ఇంకో కేసో కాదు సత్యంబాబు ఎదుర్కొన్నది. అత్యాచారం, హత్య కేసులో ఆయన దోషిగా 8 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. హైకోర్టు అతని నిర్దోషి అని ప్రకటించింది. ప్రభుత్వం మారితే, ఈ కేసు కొత్త మలుపు తిరగొచ్చుగాక. అప్పుడు మళ్ళీ సత్యంబాబు దోషిగా తేలొచ్చుగాక. మరి, అప్పుడు సత్యంబాబుకి ప్రభుత్వం అందిస్తున్న సహాయం నవ్వులపాలవకుండా వుంటుందా.?
ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. ఓటు బ్యాంకు రాజకీయాలకి పరాకాష్ట ఇది.