మరణించింది తెలుగుదేశం పార్టీ నేత… ఒక మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్. అది కూడా ఆత్మహత్య! మరింత దారుణం.. భర్త హార్ట్ అటాక్ తో మరణించిన మూడు నెలలకు ఆమె ఆత్మహత్య చేసుకుని ఆమె మరణించడం. అత్యంత విషాదకరమైన పరిణామం ఇది.
ఎందుకిలా జరిగింది? అని ఆరా తీస్తే.. గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శ్రీదేవి ఆత్మహత్య పరిణామం వెనుక దారుణమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఎక్కడో అమెరికాలో ఎన్ఆర్ఐలుగా ఉన్న ఆమెను, ఆమె భర్తను తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తీరు, అతి తక్కువ సమయంలోనే వారిని మరణం అంచుల వరకూ తీసుకెళ్లిన తీరును పరిశీలిస్తే.. ఇందులోని కుల రాజకీయాన్ని గమనిస్తే.. మరీ ఇంత దారుణమా.. అనిపించక మానదు.
ఆ ఎన్ఆర్ఐ ల నుంచి కోట్ల రూపాయలు డబ్బు లు తెచ్చుకున్నారు కొంతమంది తెలుగుదేశం నేతలు. తిరిగి ఇవ్వమని కోరిన వాళ్లకు పార్టీ టికెట్లను ఆఫర్ చేశారు. వచ్చేయండి.. రాజకీయంగా సెటిలైపోవచ్చనే ఆశలు పెట్టారు. ఆ ఆశలతో ఆ దంపతులూ తప్పటడుగు వేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ పదవి మీకే.. ఎన్నికల ఖర్చు పెట్టుకోవాలనే షరతు విధించారు. తప్పక ఖర్చు పెట్టుకున్న వాళ్ల పై చైర్మన్ ఎన్నిక వేళ మరో భారం పెట్టారు. ఒక్కో వార్డు మెంబర్ కూ లక్షల రూపాయలు ఇప్పించి.. ఆ దంపతులను అప్పుల పాల్జేశారు.
అంత జరిగిన తర్వాత.. ఆ దంపతులు.. తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న కులానికి చెందిన వారు కాకపోవడం అనేది అనర్హత అయ్యింది. వారిపై వేరే కులం ఆధిపత్యం మొదలైంది.. వేధింపులుగా మారాయి. ఆఖరికి మున్సిపల్ చైర్మన్ పదవి ఆసాంతం మీకు చెందదు.. రెండున్నరేళ్లు మాత్రమే మీకు, మళ్లీ మా కులం వాళ్లకు అని వాళ్లు ప్రతిపాదించారు. గట్టిగా తిరగబడే నేపథ్యం లేకపోవడంతో.. ఆ దంపతులు మిన్నకుండి పోయారు. అప్పటికే పార్టీ తరపున కోట్లు ఖర్చు పెట్టిన వాళ్లు.. పార్టీ నుంచే వేధింపులు పెరగడంతో మరింత కుమిలిపోయారు.
ఈ పరిణామల మధ్య మున్సిపల్ చైర్మన్ భర్త మూడు నెలల కిందట గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఆయన మరణించడంతో.. ఆయన భార్య పై జాలి చూపాల్సిన తెలుగుదేశం వర్గాలు.. ఆమెను రాజీనామా చేయించేంత వరకూ నిద్రపోలేదు. ఆయన మరణించడంతో తమకు మేలే జరిగిందని భావించిన దుష్టరాజకీయం అది.
ఏదో అనుకుని అమెరికా నుంచి వచ్చిన వాళ్ల రాత ఇక్కడికి వచ్చాకా మారిపోయింది. రాజకీయం గురించి అవగాహన లేక.. నమ్మి వచ్చిన వాళ్ల జీవితాలు విషాదాంతం అయ్యాయి. పెరిగిపోయిన అప్పులు.. భర్త మరణం.. ఆ విషాదంలోనూ ఆమెపై రాజకీయ వేధింపులు.. ఈ పరిణామాల మధ్య ఆత్మహత్య చేసుకుని మరణించింది ఆ ఆడబిడ్డ.
మరి ఇంత జరిగితే.. ఈ దుష్ట రాజకీయం ఒక కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన సంగతిని మెజారిటీ మీడియా చూపదు. అధికార పార్టీకి చెందిన ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ ఇలాంటిపరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం అనే సంచలన అంశం గురించి.. స్పందనే లేదు! ఏం జరిగింది.. రెండున్నర సంవత్సరాల్లో వాళ్ల జీవితాలు ఎక్కడ నుంచి ఎక్కడకు వచ్చాయి.. దీనికి అంతటికీ ఒక కుల రాజకీయం కారణం అనే అంశాన్ని ఎవ్వరూ హైలెట్ చేయడం లేదు!
మరి ఇంత జరిగితే.. కార్యకర్తల కోసం.. కార్యకర్తల చేత.. అంటూ చెప్పుకునే లోకేష్ బాబు సంతాప ప్రకటన చేయలేదు. ఎక్కడో విదేశం నుంచి వచ్చి.. తెలుగుదేశం సభ్యత్వం తీసుకుని.. తెలుగుదేశం పార్టీ తరపున పని చేసి.. ఖర్చు పెట్టుకుని.. గెలిచి నిలిచి.. మున్సిపల్ చైర్మన్ పదవికి చేరి.. ఆ తర్వాత రాజకీయాలకు బలి అయిన వాళ్ల గురించి మాట మాత్రమైన మాట్లాడటం లేదు పెదబాబు, చినబాబు.
పార్టీ కార్యకర్తలను ఉద్ధరిస్తాం.. వాళ్ల కోసం లక్షలు ఖర్చు పెడదాం.. వాళ్లే మాకు ముఖ్యం అని చెప్పుకునే లోకేష్ శ్రీదేవి మరణం గురించి కనీసం సంతాప ప్రకటన కూడా చేయకపోవడం.. ఇక్కడి కుల రాజకీయాలను మరోసారి హైలెట్ చేస్తోంది. పార్టీలోని ఒక కులం దురాశ వల్ల ఆర్యవైశ్యులైన ఆ దంపతుల జీవితాలు విషాదాంతాలు అయ్యాయి. దీనిపై స్పందించే స్థితిలోలేడు చినబాబు.