నరాలు తెగిపోతున్నాయ్‌..

రెండు మూడు రోజుల్లో తీపి కబురు అందబోతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సెలవిచ్చారు. కానీ, సరిగ్గా పెద్ద పాత నోట్లు రద్దయ్యాక 50వ రోజున కేంద్రం చాలా పెద్ద షాక్‌ ఇచ్చింది. పెద్ద పాత నోట్లు మీ దగ్గర గనుక మార్చ్‌ 31 తర్వాత వుంటే, మిమ్మల్ని జైలుకు పంపించేస్తామని ఆర్డినెన్స్‌ తీసుకురావడమే ఆ పెద్ద షాక్‌. ఇంకేముంది, ఈ షాక్‌తో కేంద్రంపై వున్న ఆ కాస్త ఆశలూ సన్నగిల్లిపోయాయి. 

మోడీ చెప్పిన 50 రోజులూ పూర్తయిపోయాయి. పోనీ, డిసెంబర్‌ 30 తర్వాత.. అనుకుంటే దానికీ రెండ్రోజులే సమయం వుంది. అంటే, 48 గంటలు. ఈ 48 గంటల్లో అద్భుతాలు జరుగుతాయనీ, ఆ అద్బుతాలతో తమ జీవితంలో కొత్త వెలుగులు కన్పిస్తాయనీ జనం అయితే ఆశించడంలేదు. ఊపిరి తీసేసినంత పన్జేశారు గనుక, కాస్తంతయినా వెంటిలేటర్‌ అమర్చుతారేమోనని బేలగా ఎదురుచూస్తున్నారు 127 కోట్ల మంది భారతీయులు. 

ఏటీఎంల నుంచి 2500 రూపాయల పరిమితి 4000కి పెరుగుతుందనీ, బ్యాంకుల నుంచి విత్‌ డ్రా పరిమితి 24,000 నుంచి 40,000 రూపాయలకు పెరుగుతుందనీ, ఇదే మోడీ సర్కార్‌ చెప్పబోయే తీపి కబురు అనే ప్రచారం జరుగుతోంది. అయితే, అసలంటూ 24,000 రూపాయల విత్‌ డ్రా పరిమితికి తగ్గట్టుగా బ్యాంకులు ఎక్కడ ఇస్తున్నాయి గనుక.? ఈ లెక్కన, కేంద్రం విత్‌ డ్రా పరిమితి పెంచినా, దాని వల్ల ఉపయోగం పెద్దగా వుండకపోవచ్చు. 

ఇంతకీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిసెంబర్‌ 30న ఏం ప్రకటన చేయబోతున్నారు.? అసలు ప్రకటన చేస్తారా.? లేదా.? భవిష్యత్తులో పన్నులు తగ్గుతాయి.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయనీ, నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి వస్తాయనీ, అన్నిటికీ మించి గత 50 రోజుల నరకం నుంచీ దేశ ప్రజానీకం బయటపడ్తుదనీ.. విన్పిస్తోన్న ఊహాగానాల్లో నిజమెంత.? ఏమో, ప్రస్తుతానికైతే నరాలు తెగే ఉత్కంఠ తప్ప.. కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలూ కన్పించడంలేదు.

Show comments