మీడియా మైండ్ గేమ్? లేదూ నిజమేనా?

తెలివైన వేటగాడు టైమ్ కోసం ఎదురుచూస్తాడు..పులి ఒకసారి దెబ్బతినే వరకు ఓపిగ్గా వేచి వుంటాడు..అప్పుడు దెబ్బ మీద దెబ్బ తీసి దాన్ని మట్టుపెట్టాలని చూస్తాడు. ఇప్పుడు బాబు అనుకూల మీడియా జగన్ విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జగన్ మాంచి ఫైర్ మీద వున్నాడు. అమరావతి వ్యవహారం, సత్రం భూముల అమ్మకం, విభజన హామీలు, ప్రత్యేక హోదా, నీటి సమస్యలు ఇలా చాలా ఇస్యూలను టేకప్ చేసి చకచకా దూసుకుపోతున్నాడు. తెలంగాణతో నో మొహమాట్స్ అనేసాడు. కేంద్రంలో  భాజపా కూడా జగన్ కు కాస్త అనుకూలంగా వుంటోందేమో అన్న అనుమానం కూడా కలిగింది.  

సరిగ్గా ఇలాంటి సమయంలో ఎన్  ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ జగన్ ఆస్తులను అటాచ్ చేసింది. సరే దీని టెక్నికాలిటీస్ ఏమిటి? లీగల్ సొల్యూషన్లు ఏమిటి? ఇవన్నీ అలా వుంచితే, ఇదే అదనుగా జగన్ ను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉత్సాహం కట్టలు తెంచుకుంది తెలుగుదేశం అనుకూల మీడియాలో. కేవలం ఒక్క అటాచ్ మెంట్ వార్త వచ్చిన రోజునే పేజీల కొద్దీ కథనాలు వండి వార్చేసారు. నిజమే ఆ ఇస్యూలో అంత వుంది కాబట్టే అని అనుకుందాం. మరి సత్రం భూముల విషయంలో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఎక్కడికిపోయింది? అలా ఎవరూ అడక్కూడదు. సరే, ఆ రోజు గడిచిపోయింది..తరువాత ఏంటీ? కొనసాగింపు ఎలా? అందుకే ఇక కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి. 

పొలిటికల్ గ్యాసిప్ లు ప్రారంభమయ్యాయి. జగన్ భయంలో పడ్డాడు, కేసుల్లో చిక్కుకుని జైలుకు పోతానేమోనన్న భయం ఆయనను పట్టుకుంది. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలంటూ జ్యోతిష్కులను పిలిపించుకుని జాతకం పరిశీలించుకున్నాడు. ఎలాంటి శాంతి చేస్తే దోష నివారణ జరుగుతుంది, అదెలా చేయాలో తెలుసుకున్నాడు, దీనిపై వైకాపా సీనియర్ నేతలతో కూడా చర్చించాడు. ఇది మీడియాలో నానా హడావిడీ చేసిన వార్త. మరి కొన్ని మీడియాలు ఓ అడుగు ముందుకేసి జగన్ క్రిస్టియన్ అయినా జ్యోతిష్కులను ఆశ్రయించాడు. 

అంటే ఆయన చేసిందేమిటో ఆయనకు తెలుసు, కేసుల నుంచి బయటపడలేను అన్న భావన ఆయనలో ఉంది. అందుకే అలా చేశాడు అంటూ వార్తా కథనాలను ప్రసారం చేశాయి. అంతే కాదు ఈ విషయం తెలిసి వైకాపాలో అలజడి మొదలయింది. జగన్ జైలుకు పోతే మన పరిస్థితేంటి అన్న ఆందోళనకు గురయ్యారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి. అధికార పార్టీ తలుపులు తెరుచుకునే ఉన్నాయి. వెంటనే చేరిపోవడం బెటర్ అనుకుంటున్నారని కూడా వార్తలు వెలుబడ్డాయి.  ఇదంతా ఏమనుకోవాలి..ప్రత్యర్థి దెబ్బ తిన్నాడన్న జాలి యుద్ధంలో వుండకూడదు..మరిన్ని దెబ్బలు తీయాలి. 

అదే సమయంలో నాయకుడు డీలా పడ్డాడన్న సంకేతాలు పంపి సైన్యాన్ని కకావికలు చేయాలి. ఈ వార్తల వెనుక లక్ష్యం అదే తప్ప మరేమీ కాదు.  చంద్రబాబు ఆకర్ష్ వేగవంతం కోసం ఆడిన మైండ్ గేమా అన్న అనుమానాలు రేకెత్తాయి. ఇలా ప్రచారం చేయడం వల్ల కాస్తా అటూ ఇటూగా డోలాయమానంలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేస్తారు. అంతే కాక చేరికకోసం పెద్దగా డిమాండ్లు కూడా పెట్టరు. అందుకే అవకాశం దొరకడంతో ఓ రాయివేశారు. తగిలితే తగులుతుంది లేకపోతే లేదు,  నష్టమేమి ఉండదు, జరిగితే లాభమే జరుగుతుంది కాబట్టి ఇలా పుకార్లు పుట్టించారన్న వాఖ్యలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి.

నిజమేనా?

జగన్ పూర్తిగా జ్యోతిష్కులతోనే గడిపాడు, ఈడీ వ్యవహారంతో ఆయన వద్దకు వెళ్లి కలిసి మాట్లాడడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యేలకు, సీనియర్లకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆయనలో భయం తీవ్రంగా ఉందని కూడా కొందరు వైకాపా సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు కూడా పుకార్లు షికారు చేశాయి. సరే ఇవి పుకార్లా, లేక కొంత వాస్తవముందా అన్నది కూడా ఒకింత ఆలోచింప చేసేదే. కారణం నిప్పులేనిదే అగ్గి రాజుకోదు. అంటే జగన్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా లోటస్పాండ్ కే పరిమితమయ్యారు అన్నది మాత్రం వాస్తవం. 

ఆస్థుల అటాచ్మెంట్ వ్యవహారంపై ఈడీ అధికారులు జగన్ ఇంటికి వచ్చారు. వారితోనే ఆయన మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి పార్టీ వారికి అపాయిట్మెంట్ ఇవ్వలేదు అని వైకాపా నేతలు కొందరు మీడియాముందు పేర్కొన్నారు. ఈ ఏపీసోడ్ ఎలా ఉన్నా.. ఈడీ అటాచ్మెంట్ వ్యవహారం జగన్ పై, వైకాపా పై ఎంత మేరకు పడుతుందనే చర్చ మాత్రం రాజకీయవర్గాల్లోనూ, పార్టీలోనూ కొంత మేర మొదలయింది అన్న మాట మాత్రం వాస్తవం.

Show comments