వినుకోండహో.. బాబును ఎవరూ ఓడించలేదట!

రెండు రాజధానులను నిర్మించేశా, హైటెక్ సిటీని చూస్తే అదో గర్వం.. లాంటి మాటలతో పాత రికార్డే వేశారు కానీ… ఈ సారి జనాల కళ్లు తెరిపించే మాటలు మరికొన్ని మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచానికి సరికొత్త నాయకత్వ పాఠాలు చెప్పారాయన! ఈ సారి ఆయన సెలవిచ్చిన అంశం ఏమనగా.. గతంలో రెండు సార్లు ఎన్నికల్లో తన ఆధ్వర్యంలోని పార్టీ ఓడిపోలేదట! “గతంలో ఎవ్వరూ నన్ను ఓడించలేదు..’’ అని కూడా బాబు నొక్కి చెప్పారు!
అదేంటి.. అంటే, ఆయన చర్యలే ఆయనను ఓడించాయట! ఓటమికి కొత్త భాష్యం! ఓటమికి బాధ్యుడిని నేను కాదు.. నా చర్యలే.. అని అంటున్నారు చంద్రన్న!

ఈ లెక్కన ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ రంగంలోనూ తన ఓటమికి తాను బాధ్యుడు కాదు! ఎన్ని తప్పులు చేసిన వారు అయినా బాబుగారు ప్రవచిస్తున్న సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఎంచక్కా బయటపడిపోవచ్చు.

ఉదాహరణకు.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సోనియాగాంధీ కాదు కారణం.. ఆమె చర్యలే! ఆ చర్యలు ఏవైనా అయ్యుండొచ్చు. నియంతృత్వ ధోరణిలో వ్యవహరించడం, పార్టీని పూర్తిగా గుప్పిట్లో ఉంచుకోవడం, ఏపీ వంటి రాష్ట్రాల విషయంలో అర్థరహితంగా వ్యవహరించడం.. వంటి కారణాల చేత కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది కానీ, ఆ పార్టీ ఓటమికి సోనియాగాంధీ ఏ మాత్రమూ కారణం కాదు! అదంతే. 

2004లో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడి 294 సీట్లకు గానూ కేవలం 40 చిల్లర సీట్లకు పరిమితం అయ్యింది, ఐదేళ్ల ప్రతిపక్ష వాసం అనంతరం.. మహా కూటమి రూపంలో నాలుగైదు పార్టీలను కలుపుకుని వెళ్లి కూడా వంద సీట్లకు మించి సాధించలేకపోయింది! ఈ ఓటములకు తాను బాధ్యుడిని కాదు అని బాబు స్పష్టం చేస్తున్నాడు. పార్టీ అధినేతగా.. అది తన ఓటమి కాదని అయన సెలవిచ్చారు!

Readmore!

ఆయన చర్యలకు దక్కిన ఫలితం మాత్రమే ఆ ఓటములు. నాయకత్వ సదస్సులో ఇలాంటి పలాయన వాదాలు వినిపించడం బాబులాంటి వారికి తప్ప మరొకరికి సాధ్యం కాదు. 1995 నుంచి 2004 వరకూ తన పాలన ఫలితంగానే ఆ ఎన్నికల్లో తాము ఓడిపోయామని మాత్రం బాబు ఒప్పుకోవడం లేదు. తన తీరుతో విసిగి వేసారిన జనం 40 సీట్లకు పరిమితం చేశారని ఒప్పుకోవడం లేదు. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చుని కూడా ప్రజల తనపై విశ్వాసాన్ని ప్రోది చేసుకోలేకపోయానని ఆయన ఒప్పుకోవడం లేదు. పదేళ్ల వ్యవధిలో ఎదురైన రెండు ఓటములకూ తను కారణం కాదు.. అని ఆయన అంటున్నారు.
  
పీఎస్: ఓటమికి తను కారణం కాదని బాబుగారు చెప్పారు, తన చర్యల ఫలితంగానే రెండు సార్లు ఓడిపోయామని చెప్పారు. మరి రేపటి ఎన్నికల్లో కూడా తమ చర్యల మీదే ప్రజాతీర్పు ఉంటుందని ఆయన గుర్తిస్తే ఆయనకే మంచిది! 

Show comments