బొచ్చెలో బిచ్చం కూడా వెయ్యలేదాయె.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం లక్షన్నర కోట్లు పైనే ఖర్చవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అంచనా వేశారు. మరీ ఆ స్థాయిలో కాకపోయినా, హీన పక్షం పది వేల కోట్లు అయినా కేంద్రం ఇస్తుందేమోనని అంతా భావిస్తున్నవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు బీభత్సమైన వెటకారం చేశారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం 2 వేల 500 కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోందట. ఇది వెటకారం కాకపోతే మరేమిటి.? 

పైగా, విజయవాడ - గుంటూరు నగరాల కోసం ఇప్పటికే ఇచ్చిన నిధులు కూడా రాజధాని నిర్మాణంలో భాగమేనని కేంద్రం, చంద్రబాబుకి తెగేసి చెప్పిందట. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ విషయాల్ని చంద్రబాబుకి వివరిస్తే, చంద్రబాబు అదే విషయాన్ని మీడియా ముందు నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. ఇంకేముంది, చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు.. పాతిక వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చేస్తారట, కుదరదు.. ప్రత్యేక హోదా కావాల్సిందేనని 'మేధావి' చలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నానా హడావిడి చేసేశారు నిన్నటికి నిన్న. ఏపీలోని టీడీపీ అనుకూల మీడియా అయితే, చంద్రబాబు తీపి కబురు తీసుకురాబోతున్నారంటూ కథనాల్ని తెరపైకి తెచ్చింది. 

చైనా నుంచి చంద్రబాబు సూట్‌కేసుల్ని ఢిల్లీకి తీసుకెళ్ళారో లేదోగానీ, ఢిల్లీ నుంచి మాత్రం ఖాళీ చిప్ప తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్‌కి. 2500 కోట్లతో, రాజధాని అమరావతి కాదు కదా, అమరావతిలోని హై టెన్షన్‌ కేబుల్‌ వైర్లకూ ఖర్చులు చాలవని చంద్రబాబే సెలవిచ్చారు. అంటే, ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం ఏం చేయాలట.? కేంద్రం ఏం చేసినాసరే.. ఏపీ మీడియా ముందు ప్రశ్నిస్తాం.. కేంద్రం ముందు సాగిలా పడ్తాం.. ఇదీ చంద్రబాబు నైజం. అందుకే కేంద్రం, ఎంచక్కా ఆంధ్రప్రదేశ్‌తో ఆడుకుంటోంది.. చంద్రబాబుని ఎంటర్‌టైన్‌ చేస్తోంది. సర్కస్‌లో బఫూన్‌లా చంద్రబాబు కేంద్రం ముందు ఆటలాడుతున్నంతకాలం పరిస్థితి ఇలానే తగలడుతుంది మరి.

Show comments