నరేంద్ర మోదీ బ్రహ్మచారా?

పెద్ద నోట్ల రద్దుతో ఓ పక్క దేశం అతలాకుతలమైపోతుంటే, సామాన్య, పేద వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఇబ్బందులు పెడుతుంటే మరో పక్క కొందరు బీజేపీ నాయకులు, మోదీ అభిమానులు జోకులు పేలుస్తున్నారు. ఇది జోకులు వేయాల్సిన సమయమా? ఇతరుల సంగతి అలా పక్కన పెడదాం. కోట్లకు పడగలెత్తిన యెగా గురువు, పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, బీజేపీకీ సన్నిహితుడైన బాబా రాందేవ్‌ ఒళ్లు మండిపోయే కుళ్లు జోకు వేశారు. ఇది వ్యంగ్యమో, బీజేపీ పట్ల సానుభూతో అర్థం కాకుండా ఉంది. ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సరిగ్గా పెళ్లిళ్ల సీజన్లో ప్రకటించారు. 

కార్తీకమాసం నుంచి రెండు నెలలు పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. దేశ వ్యాప్తంగా ఈ సీజన్లో వివాహాలు చేస్తుంటారు. కార్తీక మాసంలో ఒక్క వివాహాలే కాదు. ఆధ్యాత్మికంగా కూడా ఈ నెలకు ప్రాధాన్యం ఉంది కాబట్టి అందుకు సంబంధించిన పూజలు పునస్కారాలు ఆలయాల్లో, ఇళ్లలో ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఇన్ని కార్యక్రమాలున్న సమయంలో మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించడంతో కూతుళ్లకు, కుమారులకు వివాహాలు చేయాలనుకొని ముహూర్తాలు పెట్టుకున్నవారు కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. తెల్లారితే వివాహమనగా రాత్రికి రాత్రి నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించడంతో పెళ్లి ఇళ్లలో కన్నీటివాన కురిసింది. 

రోజుల తరబడి వివాహాలకు ఏర్పాట్లు చేసుకున్నవారు, శుభ లేఖలు పంచుకున్నవారు నిలువునా నీరుగారిపోయారు. ఈ విషాద గాథల సంగతి చెప్పుకుంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఇంతటి విపత్కర పరిస్థితిని రాందేవ్‌ బాబా తేలిగ్గా తీసుకొని జోక్‌ పేల్చారు. దానికి ఆయన పగలబడి నవ్వుకున్నాడేమోగాని జనాలకు ఒళ్లు మండిపోయుంటుంది. ఇంతకూ ఆయనేమన్నారు? 'చాలామంది బీజేపీ నాయకులు బ్రహ్మచారులు. వారికి పెళ్లిళ్ల సీజన్‌ గురించి అవగాహన లేదు. వెడ్డింగ్‌ సీజన్‌ ప్రాధాన్యం వారు గుర్తించలేదు. ఇది పొరపాటు'...అని సెలవిచ్చారు. రాందేవ్‌ బాబా బీజేపీని వెనకేసుకొచ్చారుగాని  ఆయన కూడా అవగాహన లేకుండా మాట్లాడారు. 

బీజేపీలో అనేకమంది నాయకులు బ్రహ్మచారులుగా ఉండొచ్చు. ప్రస్తుత కాలంలో బ్రహ్మచారులంటే పెళ్లి చేసుకోనివారని అర్థం కదా. ఆ లెక్కన బీజేపీలో చాలామంది నాయకులు పెళ్లి చేసుకోలేదని బాబా అభిప్రాయం. ఆయన ఉద్దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా బ్రహ్మచారే. కాబట్టి ఆయనకు కూడా పెళ్లిళ్ల సీజన్‌పై అవగాహన లేదని, కాబట్టి జనం సర్దుకుపోవాలని రాందేవ్‌ చెప్పారన్నమాట. ఈయన పిచ్చి భాష్యాన్ని విశ్లేషించుకుంటే...ప్రధాని నరేంద్ర మోదీ బ్రహ్మచారి కాడు. పెళ్లి చేసుకున్నారు. కాని భార్య నుంచి దూరంగా ఉంటున్నారు. చట్టప్రకారం విడాకులు తీసుకోలేదు. 

కాబట్టి చట్ట ప్రకారమైనా, హిందూ సంప్రదాయం ప్రకారమైనా ఆయన వివాహ బంధంలో ఉన్న వ్యక్తే. రెండోది...నోట్ల రద్దు నిర్ణయంతో బీజేపీలోని బ్రహ్మచారులకు సంబంధమే లేదు. బ్రహ్మచారులంతా కలిసి నోట్ల రద్దు నిర్ణయం తీసుకోలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ నిర్ణయంతో మంత్రి మండలికి కూడా సంబంధం లేదు. ఇది పూర్తిగా మోదీ వ్యక్తిగత నిర్ణయం. రద్దు ప్రతిపాదనను కేబినెట్‌ సమావేశంలో పెట్టి, చర్చంచి, మంత్రుల అభిప్రాయాలు తెలసుకొని నిర్ణయం ప్రకటించలేదు. కేబినెట్‌  సమావేశం ముగించే సమయంలో మోదీ హఠాత్తుగా తన నిర్ణయం ప్రకటించి, మంత్రులను బయటకు వెళ్లొద్దని ఆదేశించి, పెద్ద నోట్లు రద్దు చేసినట్లు మీడియాకు తెలియచేశారు. 

చివరకు ఆర్థిక మంత్రికి కూడా చెప్పలేదు. కాబట్టి  నోట్ల రద్దు అనేది బ్రహ్మచారుల నిర్ణయం కాదు. మంత్రిమండలి నిర్ణయమూ కాదు. దేశ, కాల పరిస్థితులను గమనించకుండా లేదా అధ్యయనం చేయకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నోట్లు రద్దు చేయడం మోదీ తొందరపాటును, అపరిపక్వతను తెలియచేస్తోంది. నోట్ల రద్దుపై ఇప్పడో ధర్మసందేహం తలెత్తింది. ఏమిటది? నోట్ల రద్దు నిర్ణయం చాలా కీలకమైంది. దేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. ఇంతటి కీలక నిర్ణయాన్ని మంత్రి మండలిలో చర్చించకుండా మోదీ ప్రకటించారు. 

ఇది ప్రజాస్వామ్యానికి విరద్ధమని, ఇది చెల్లదని కొందరు ఆర్థిక, న్యాయ నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. రద్దుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసినా అది కూడా ఈ చర్యను అప్రజాస్వామికమని అనలేదు. కనీసం సందేహం కూడా వెలిబుచ్చలేదు. పెద్ద నోట్లు రద్దు చేశాక కూడా మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్థన రెడ్డి తన కుమార్తె వివాహానికి వందల కోట్లు ఖర్చు చేయగలగారంటే ఇది మోదీ సర్కారుకు సవాలు విసిరినట్లుగానే భావించాలి. ఇన్ని వందల కోట్లు ఎలా ఖర్చు చేయగలిగారో ఆరా తీస్తారా?

Show comments