బీజేపీ ప్రజా ప్రతినిథులు.. అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాల్ని వెల్లడించాలి. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలివి. ఈ నేపథ్యంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ నేతలకు 'లావాదేవీల వెల్లడిపై' స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకోసమంటూ ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లదొంగలెవరూ బయటకు రాలేదు. సామాన్యుడు మాత్రం రోడ్డున పడిపోయాడు. ప్రధానంగా బీజేపీ నేతలు ముందే జాగ్రత్తపడిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో, ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ ప్రజా ప్రతినిథుల బ్యాంకు లావాదేవీల వివరాల వెల్లడి పథకానికి పార్టీ పరంగా శ్రీకారం చుట్టినట్లున్నారు.
అయితే, ఏ ప్రజా ప్రతినిథీ తన పేరుతో నిర్వహించే బ్యాంకు అక్కౌంట్లతో 'నల్ల' వ్యవహారాలు చక్కబెట్టరు. ఎవరిదాకానో ఎందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతిలో చిల్లిగవ్వ కూడా వుండదు. దేశంలో ప్రజా ప్రతినిథుల్ని తీసుకుంటే, మెజార్టీ నేతలకు సొంత వాహనాలు వుండవు. కానీ, నేతలు ఖరీదైన వాహనాల్లో తిరుగుతుంటారు. అదే మరి, రాజకీయమంటే.
అసలు వ్యవహారం జరిగేదంతా బినామీలతోనే. ప్రజా ప్రతినిథుల కుటుంబ సభ్యులకు వ్యాపారాలుంటాయి.. అవి ప్రజా ప్రతినిథులకు సంబంధించినవి కానే కావు. ఇక్కడ కూడా గ్రేట్ ఎగ్జాంపుల్ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే. ఆయనేమో జస్ట్ లక్షాధికారి. అదే, చంద్రబాబు సతీమణిని తీసుకుంటే.. ఆమె కోటీశ్వరురాలు. అదే మరి, రాజకీయం అంటే. వాస్తవాలు ఇంత క్లియర్‌గా కన్పిస్తోంటే, ప్రజా ప్రతినిథుల బ్యాంకు లావాదేవీల్ని బయటపెట్టాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నా దాని వల్ల ఒరిగేదేమీ లేదు.
కొసమెరుపు: నవంబర్ 8 తర్వాత దేశంలో చాలా రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించాయి. వాటికి నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయి.? సామాన్యుడు వంద రూపాయలు సంపాదించడం గగనమైపోతున్న ప్రస్తుత తరుణంలో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి రాజకీయ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించడమంటే చిన్న విషయం కాదు. ఇలా బహిరంగ సభలు నిర్వహించిన పార్టీల్లో బీజేపీ కూడా వుంది. బీజేపీ కూడా అక్రమంగా నిధుల్ని రాబట్టుకుంటున్న పార్టీల్లో ఒకటి.