సన్మానాల వెంకయ్య.. మొహం చాటేస్తున్నారా.?

రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయల ప్యాకేజీ.. అంటూ నిన్న మొన్నటిదాకా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఓ రేంజ్‌లో సంబరపడ్డారు. ప్యాకేజీ లేదు.. గాడిద గుడ్డూ లేదు.. అది జస్ట్‌, ప్రత్యేక సాయం మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చేసినా, దానికి చట్టబద్ధత ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేకపోయినా.. కేంద్ర మంత్రి వెంకయ్య మాత్రం ముందే తొందరపడి సన్మానాలు చేయించేసుకున్నారు. 

లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టాక, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి నోట మాట పడిపోయింది. మెట్రో రైల్‌ కోసం 100 కోట్లు కేటాయిస్తారా.? ప్రత్యేక హోదా ఊసెత్తరా.? గుక్క తిప్పుకోకుండా వెంకయ్య ఏ జాతీయ సంస్థల గురించి అయితే చెబుతున్నారో, వాటి ప్రహరీల నిర్మాణానికీ సరిపోని మొత్తంలో నిధులు కేటాయిస్తారా.? ఇలా చెప్పుకుంటూ పోతే, సవాలక్ష ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయిప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నుంచి. 

దాంతో, సహజంగానే వెంకయ్య నోటికి తాళం పడిపోయింది. 'అబ్బే, బడ్జెట్‌ పూర్తిగా చదివితే వాస్తవాలు తెలుస్తాయి.. శాఖల వారీ కేటాయింపులు జరిగాయి.. ఆంధ్రప్రదేశ్‌కి చాలా చాలా వచ్చేస్తాయి.. ఒట్టు, నిజం..' అంటూ పైకి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారుగానీ, కేంద్ర బడ్జెట్‌ - ఆంధ్రప్రదేశ్‌కి మొహం చాటేసిన వైనం ఆయనకు మాత్రం అర్థం కాకుండా వుంటుందా.? 

నిధుల కేటాయింపు సంగతి అలా వుంచితే, రాజధాని అమరావతి ఊసెత్తకపోవడం, రైల్వే జోన్‌ ప్రస్తావన లేకపోవడం.. ఇవన్నీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి రాజకీయ సంకటాలే. అందుకే, ఆయనిప్పుడు అంత ఎక్కువగా మీడియా ముందుకు రాలేకపోతున్నారు. లేకపోతే, వెంకయ్య తెలుగు మీడియా అంతటా కన్పించేవారే. Readmore!

Show comments