'కాటమరాయుడు' టీజర్‌ తెచ్చేశారు.!

ఎట్టకేలకు పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కాటమరాయుడు' టీజర్‌ బయటకొచ్చింది. కాస్సేపటి క్రితమే సోషల్‌ మీడియాలో టీజర్‌ని విడుదల చేశారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'గోపాల గోపాల' ఫేం డాలీ (కిషోర్‌ కుమార్‌ పార్దసాని) దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. శృతిహాసన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

తమిళంలో అజిత్‌ హీరోగా వచ్చిన 'వీరం' చిత్రాన్నే 'కాటమరాయుడు'గా తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నారు. రీమేక్‌ అన్న విషయాన్ని తొలుత కన్‌ఫామ్‌ చేసింది హీరోయిన్‌ శృతిహాసన్‌ కావడం గమనార్హం. అప్పటిదాకా, 'వీరం' సినిమా రీమేక్‌ కాదు, దాన్నుంచి స్ఫూర్తి పొందిన సినిమా అంటూ.. చిత్ర యూనిట్‌ వాదిస్తూ వచ్చింది. అయితే, టీజర్‌లో అచ్చంగా 'వీరం' సినిమాని దించేసిన వైనం కన్పించింది. 

మరోపక్క, పవన్‌కళ్యాణ్‌ పవర్‌ఫుల్‌గా కన్పించాడీ టీజర్‌లో. పంచెకట్టుతో పవన్‌ కన్పిస్తున్నాడు. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌, ఓ చిన్న డాన్స్‌ బిట్‌.. ఇలా టీజర్‌తో అభిమానుల్ని ఖుషీ చేసే అన్ని అంశాల్నీ మిక్స్‌ చేసేశారు. ఏం చేసినా, తెలుగులోకి డబ్బింగ్‌ రూపంలో ఆల్రెడీ వచ్చేసిన తమిళ 'వీరం'ని ఇప్పుడు రీమేక్‌ చేయడం ద్వారా ఏం కొత్తదనం చూపించగలుగుతున్నారన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

Show comments