మన పత్రికలు సమస్యలు చెప్పడం లేదా?

తెలుగుదేశం అనుకూల పత్రికలు చదువుతుంటే, ఆంధ్ర అంతా సస్య శ్యామలంగా, అభివృధ్ధి పరిఢవిల్లుతున్నట్లుగా, అస్సలు సమస్యలే లేనట్లుగా అనిపిస్తుంది. అది సహజం. ఎక్కడ చిన్న సమస్య అన్నది వున్నా, దాన్ని అక్షరాల్లోకి రాకుండా తెలుగుదేశం అనుకూల మీడియా జాగ్రత్త పడుతుంది.

కానీ చిత్రంగా తెలుగుదేశం పార్టీ మాత్రం చిత్రమైన ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని గ్రామాల్లో వున్న సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలియాలట. అందుకోసం వేరే ఆలోచన చేస్తోంది.

రాష్ట్రంలో డాక్టరు చదువు చదువుతున్న వారందరిలో వాలంటరీగా ముందుకు వచ్చేవారిని ఎంపిక, చేసి అన్ని గ్రామాలకు పంపిస్తుందట. వారు వాళ్ల వాళ్ల స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రభుత్వం కేటాయించే యుఆర్ఎల్ కు కనెక్ట్ అయి, ఆ గ్రామాల సమస్యలను అప్ లోడ్ చేస్తారట.

అలా ఒకేసారి పదమూడు వేల గ్రామాల సమస్యలు అప్ లోడ్ కావాలన్నది లక్ష్యమట. ఇందుకోసం వైద్య విద్యార్థులను రిపోర్టర్లుగా వాడుకుంటారట. అప్ లోడ్ అయిన సమస్యలను ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు చూసి, వెంటనే పరిష్కరించే పని చేపడతారట. Readmore!

అదీ విషయం. ఇందుకోసం, భారీగా వైద్య విద్యార్థులను రిపోర్టర్లుగా మార్చే కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్లు చదువులు పక్కన పెట్టి, నెలనెలా గ్రామాల్లో పర్యటిస్తారట.

ఇంత హడావుడి ఎందుకో? పార్టీ సంగతి పక్కన పెట్టి, కాస్త నిజాలు చెప్పమని తెలుగుదేశం పార్టీ తమ అనుకూల దినపత్రికలను కోరితే సరిపోతుందిగా? వాటికి రాష్ట్ర వ్యాప్త యంత్రాంగం వుంటుంది. సమస్యలు చిటికెలో పేపర్లలోకి వస్తాయి.

బహుశా సమస్యలు పబ్లిక్ కాకుండా, కేవలం ప్రభుత్వ వెబ్ సైట్ కు మాత్రమే పరిమితం కావాలన్నది ప్రభుత్వ ఆలోచన ఏమో? ఆ మధ్య కేంద్రం కూడా రహదారులు బాగు లేకుంటే ఫోటో తీసి అప్ లోడ్ చేయమని తెగ పబ్లిసిటీ చేసింది. అప్ లోడ్ లు చేయడమే తప్ప, రోడ్లు బాగయిన దాఖలాలు మాత్రం లేవు. ఇప్పుడు ఈ స్కీము అంతేనేమో? హడావుడి ఎక్కువ. అసలు తక్కువ అంటే ఇదేనేమో?

Show comments