నోట్ల తతంగం: బాబుకు తెలిసీ, వాళ్లకు చెప్పలేదా?

మారకంలో ఉన్న ఐదువందల, వెయ్యి రూపాయల నోట్లు కేంద్రం వెనక్కు తీసుకుంటున్న అంశం కొందరికి ముందే తెలుసు.. అనేదానిపై క్రమంగా స్పష్టత వస్తోంది. ఈ అంశం సంచలన రీతిలో ప్రధానమంత్రి స్వయంగా చేసిన ప్రకటనతో అధికారికంగా వెలుగులోకి వచ్చినా… దీని వెనుక మాత్రం చాలా తతంగం నడిచిందనే మాట ప్రకటన వచ్చినప్పటి నుంచి వినిపిస్తోంది.

కొన్ని హిందీ పేపర్లు కేంద్రానికి ఉన్న ఈ ఆలోచన గురించి కొన్ని నెలల క్రితమే ప్రచురించడం… పై అభిప్రాయాలకు ఊతం ఇస్తోంది. కేంద్ర కేబినెట్ స్థాయిలో చర్చ లేకుండా, ముఖ్యమంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంతటి సంచలన నిర్ణయం మోడీ మాత్రమే తీసుకునే అవకాశం లేదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉండిన రాజన్ ను ఒకింత వివాదాస్పద రీతిలో ఒక టర్మ్ పూర్తి కాగానే వెనక్కు పంపించడం, ఒక వ్యాపార కుటుంబానికి సన్నిహితుడిగా, ఆ వ్యాపార సంస్థలో పని చేసిన వ్యక్తిని తెచ్చి ఆర్బీఐ గవర్నర్ గా చేయడం.. ఇదంతా జరిగిన వెంటనే ఈ ప్రకటన రావడం.. ఇందులో చాలా లొసుగులు ఉన్నాయనే మాట దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది.

ఈ సంగతిలా ఉంటే.. కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతల నుంచి ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది. ఇది తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో నిరసన లాంటిది. చంద్రబాబుకు ఈ నోట్లు వెనక్కు తీసుకునే అంశం గురించి క్లారిటీ ఉండి కూడా తమకు చెప్పలేదు.. అనేది ఆ జిల్లాల తమ్ముళ్ల నుంచి వినిపిస్తున్న మాట. 

అమరావతి ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ  రెండు జిల్లాల్లో రియల్ బూమ్ ఎగిసిన నేపథ్యం.. దీనికి తోడు  ఎంతైనా అధికారంలో ఉన్నారు కాబట్టి.. సంపాదన మార్గాలు చాలా ఎక్కువ! అందిన కాడికి దోచుకోవడం జరుగుతూ పోతోంది. ఇలాంటి వారి దగ్గర సహజంగానే నల్లధనం  పేరుకుపోయి ఉంటుంది. సంచుల్లో కుక్కుకునేంత స్థాయికి చేరింది. ఇలాంటి వారు ఇప్పుడు బోరు మంటున్నారు.  ఈనోట్లను వెనక్కు తీసుకెళితే బుక్ అయిపోతారు, అలాగని దగ్గరే పెట్టుకుంటే మురిగిపోతాయ్! ఈ నేపథ్యంలో కాస్తంత చిత్రమైన  ఆవేధనే వ్యక్తం అవుతోంది అక్కడ. 

నోట్లను వెనక్కు తీసుకునే అంశంపై బాబుకు క్లారిటీ ఉంది, ఆ క్లారిటీతోనే ఆయన కొన్ని రోజుల క్రితం లేఖ రాశాడనే అన్న అభిప్రాయంతో… తమ్ముళ్ల ఆవేదన మరింత అధికం అవుతోంది. బాబుకు తెలిసి కూడా మాకు సమాచారం ఇవ్వలేదు.. అనేది వీరి అభియోగం.

Show comments