ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో అయితే.. మాటెత్తితే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలి, అసెంబ్లీని సంవత్సరానికి 50 రోజులకు తగ్గకుండా నిర్వహించాలి.. అని తెగ డిమాండ్ చేసేవారు చంద్రబాబు. అయితే అధికారంలోకి వచ్చాకా.. తనకు మించిన మేధావి, తనకు మించిన పాలకుడు.. లేడు అని బలంగా విశ్వసిస్తున్న, బయటకే అనేస్తున్న ఆయన, అసెంబ్లీని నామమాత్రంగా, అఖిలపక్షం అనే మాటను అస్సలు వినిపించకుండా చేశారు!
ఏ సమస్య వచ్చినా.. చిన్నదో, పెద్దదో.. అది ఏదైనా సరే, ‘ఆల్ పార్టీ మీటింగ్.. పెట్టండి, అసెంబ్లీని సమావేశ పర్చండి..’ అంటూ బాబు అప్పట్లో మాట్లాడే వారు. అయితే విభజన తర్వాత, అధికారంలోకి వచ్చాకా.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతి సీజన్ లోనూ వారం, పది రోజులకు పరిమితం అవుతున్నాయి.
ఇలా సాగుతున్న వ్యవహారంలో ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈ ఏడాది శీతాకాల సమావేశాలే ఉండవట! అదేమంటే.. తాత్కాలిక రాజధానిలో అసెంబ్లీ నిర్మాణం ఇప్పుడప్పుడే పూర్తి కాదట, అందుకే.. శీతాకాల సమావేశాలను రద్దు చేస్తున్నారట.
నిక్షేపంగా.. హైదరాబాద్ ను తాత్కాలిక రాజధానిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పదేళ్ల పాటు ఆ నగరంలో ఏపీకోటాకు వచ్చిన భవనాలపై హక్కులుంటాయి. మొదట్లో హైదరాబాద్ ను వదిలేది లేదు అని ప్రకటించిన చంద్రన్న ఆ తర్వాత.. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నాకా, ఆ నగరం అంటే అంతులేని విరక్తిని ప్రదర్శిస్తున్నారు.
ఆ నగరాన్ని ఖాళీ చేసే వరకూ నిద్రపోలేదు. అసెంబ్లీ సమావేశాల విషయంలో అయితే, చాలారకాల ప్రకటనలే చేశారు. ఏపీలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ అనేశారు. అయితే.. ఇప్పటికీ ఎక్కడా ఏర్పాట్లు పూర్తి కాలేదు. ఏర్పాట్లు పూర్తి కాలేదు కాబట్టి.. శీతాకాల సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించుకోవచ్చు. అయితే చంద్రబాబు ప్రభుత్వ ఇగో అందుకు ఒప్పుకుంటున్నట్టుగా లేదు! అందుకే.. ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే రద్దు చేసి పడేసినట్టున్నారు!
అధికారంలో ఉన్నామని వీర్రవీగేవాళ్లను చరిత్ర ఎంతో మందిని చూసింది. కానీ.. నియంతృత్వ పోకడలకు కూడా ఒక హద్దు ఉండాలి. మరీ తోచినట్టు చేసుకుపోతే కష్టం. ఎంతైనా ప్రజాస్వామ్యం!