బ్రాండ్‌ అమరావతి.. బాబూ ఏంటిది.?

విజయవాడ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 'ఎయిర్‌ కనెక్టివిటీ' పెరిగింది. అంతా రాజధాని అమరావతి పుణ్యమే. రాజధాని అమరావతి పరిధిలోనే విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం వుంది. మామూలుగా ఇది ఆర్టీసీ బస్‌స్టాండ్‌కన్నా దారుణంగా వుండేది. ఈ విషయాన్ని స్వయానా టీడీపీ నేత, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజే సెలవిచ్చారు. కానీ, ఇప్పుడు అమరావతి విమానాశ్రయం (గన్నవరం కాదు, విజయవాడ కాదు..) రూపు రేఖలు మారుతున్నాయి. జనంతో సందడిగా మారుతోంది ఈ ఎయిర్‌పోర్ట్‌. 

ఇంకోపక్క, అమరావతి పరిధిలో రైతుల పంట పండింది. ఆగండాగండీ, పంటలెప్పుడో ఎండిపోయాయి. ఇక్కడ పంట పొలాల్లో పండుతున్నది కాసుల పంట. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. రాజధాని అమరావతి.. అనే ప్రచారం ఎన్నికలకు ముందే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించేటప్పటికే, ఇక్కడ రియల్‌ మాఫియా రాజ్యమేలింది. ఎకరం కోటి నుంచి పది కోట్లదాకా పెరిగింది. తద్వారా ఎక్కడ చూసినా నోట్ల కట్టలతో కూడిన సంచులే దర్శనమిచ్చాయి. 

గుర్తుందా.? కొన్నాళ్ళ క్రితం హైద్రాబాద్‌ శివార్లలోని చాలా ప్రాంతాలు ఇదిగో, ఇలాగే కాసుల గలగలతో సందడి చేశాయి. అలాంటివాటిల్లో కోకాపేట ఒకటి. మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల షోరూంలు తాత్కాలికంగా అక్కడ వెలిశాయి. సాధారణ కుటుంబాలు సైతం, రాత్రికి రాత్రి కోట్లు గడించేశాయి రియల్‌ భూమ్‌ పుణ్యమా అని. దురదృష్టవశాత్తూ చాలామంది ఇప్పుడు అప్పులపాలైపోయారు. ఏమయిపోయాయి ఆ కోట్లు.? అంటే, వున్న భూములూ పోయాయ్‌.. వచ్చిన కోట్లూ గల్లంతయిపోయాయి.. అనే మాట విన్పిస్తోంది. 

ఒకటి విమానాశ్రయం - విమానయానం. ఇంకోటి అమరావతి భూ పందేరం. మరోటి కోకాపేట కొల్లగొట్టబడిన కోట్లు. ఈ మూడింటికీ సంబంధం వుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిపోతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చక్కర్లు కొడ్తున్నవారిలో చాలామంది ఒకప్పుడు సాదా సీదా జీవనం గడిపినవారే. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అమరావతిలో భూములకు గిరాకీ పెరిగింది.. కోట్లు రైతుల చేతుల్లోకి వచ్చిపడ్డాయి. పేకాట క్లబ్లులు వెలిశాయి.. వాటిల్లో డబ్బులు గల్లంతవుతున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తోందట.? ఆ ఒక్కటే అడక్కూడదు. 

రాజధానిలో వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి తెలిస్తే, అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుంది. నిజ్జంగా నిజం.. ఒప్పుకోరా.? అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబుని అడిగి చూడండి.. ఆయనేమంటారో.! 

ఏమో, భవిష్యత్‌ రాజధాని ముఖచిత్రమెలా వుండబోతోందోగానీ, ఇప్పుడిప్పుడే అమరావతి ప్రాంతంలో రైతుల పరిస్థితులు దయనీయంగా మారిపోతున్నాయి. వున్నపళంగా పేకాట క్లబ్బులపై చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్‌ అత్యంత భయంకరంగా తయారవుతుంది. 'ఎవడి డబ్బు వాడిష్టం..' అని ప్రభుత్వం చేతులు ముడుచుక్కూర్చోవచ్చుగాక. అదే కరెక్టని ప్రభుత్వం భావిస్తే, వ్యవస్థను సర్వనాశనం చేసేసిన ఘనతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. 

అటు వ్యవసాయం పాయె.. ఇటు రైతుల బతుకులు ఇలా తగలడుతున్నాయ్‌.. ఇదేం అమరావతి.? ఇదేం రాజధాని.? ఇదేం పాలన.?

Show comments