ఎందుకో... ప్రతిపక్ష నేతను గౌరవించారు...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తత్వానికి విరుద్ధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కమ్‌ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను గౌరవించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండాపోవాలని, ఇంకా అనేక ఏళ్లపాటు టీడీపీయే అధికారంలో ఉండాలనేది ఆయన కోరికని అందరికీ తెలిసిందే. తన తరువాత లోకేష్‌ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్ష. కుమారుడి తరువాత మనుమడు కూడా కుర్చీ ఎక్కాలని మనుసులో ఉందేమో...! దాని సంగతెలా ఉన్నా తాను రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని సర్వశక్తులు ఒడ్డి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా వైకాపా సైంధవుడి మాదిరిగా అడ్డుపడుతోందని బాబు ఆవేదన, ఆక్రోశం. 

ఆయన పరిపాలనకు కేటాయించే సమయం కంటే జగన్‌ను, వైకాపాను తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనిపిస్తోంది. ఇలాంటి చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌ను గౌరవించారంటే ఘనంగా సన్మానమో, సత్కారమో చేశారని అర్థం కాదు. నిబంధనలను, రాజ్యంగ విలువలను తుంగలో తొక్కుతున్న చంద్రబాబుకు ఎవరైనా సలహా ఇచ్చారో, ఆయన తోచిందో తెలియదుగాని జగన్‌ ప్రతిపక్ష నేత అని జ్ఞాపకం వచ్చి ప్రొటోకాల్‌ పాటించారు.

ఇంతకీ ఏం జరిగింది? రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో కొత్త అసెంబ్లీ (తాత్కాలిక) ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. సమావేశాలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీ తయారైందిగాని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు వసతి (క్వార్టర్లు) లేదు. అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్రజాప్రతినిధులు వసతి లేకుండా ఉండటం కష్టం కదా. హైదరాబాదులో ఏపీ అసెంబ్లీ జరిగినంత కాలం అక్కడ వసతి ఏర్పాటు చేశారు. అది మహానగరం కాబట్టి సాధ్యమైంది. వాస్తవానికి అక్కడ దాదాపు అందరికీ సొంత ఇళ్లున్నాయి. కాని లెక్క ప్రకారం ప్రభుత్వమే వసతి ఇవ్వాలి కాబట్టి రెసిడెన్షియల్‌ క్వార్టర్లు కేటాయించారు. వెలగపూడిలో ఆ అవకాశం లేకపోవడంతో తలా యాభై వేల రూపాయలు అలవెన్సుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్‌ విషయంలోనూ ఇదే చేద్దామనుకున్నారేమో ముఖ్యమంత్రి. కాని ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత. అంటే కేబినెట్‌ హోదా కలిగి సీఎంతో సమానమైన వ్యక్తి. కాబట్టి నిబంధనల ప్రకారం జగన్‌కు వసతి కల్పించాల్సివుంటుంది.  దీన్ని తుంగలో తొక్కుదామని బాబు అనుకున్నారో లేదో తెలియదుగాని మొత్తంమీద రచ్చ చేయలేదు.

వాస్తవానికి జగన్‌ను ఆయన ప్రతిపక్ష నేతగా భావించడంలేదు. ఆ హోదాను గౌరవించడంలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత కూడా వ్యవస్థలో భాగమే తప్ప విలన్‌ కాడు కదా. కాని బాబు దృష్టిలో దుర్మార్గుడు, దుష్టుడు. సరే...ఇక వైఎస్‌ జగన్‌కు ఏం వసతి కల్పించారు? రోడ్లు, భవనాల శాఖ ఆయనకు విజయవాడలో ఆర్‌ అండ్‌ బి  గెస్ట్‌ హౌస్‌ కేటాయించింది. ఇందులో అతిథుల కోసం ఐదు గదులు, విజిటర్స్‌ కోసం హాలు, వంటయిల్లు, పార్కింగ్‌ స్థలం మొదలైనవి ఉన్నాయి. దీనికంటే ముందు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో వసతి కల్పిద్దామనుకున్నారు. అయితే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణంతో వద్దనుకున్నారు. బడ్జెటు సమావేశాలవరకు జగన్‌ ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో గడుపుతారు.  హడావుడిగా అసెంబ్లీ భవనం నిర్మించిన బాబు సర్కారు ప్రజాప్రతినిధులకు క్వార్టర్లు, మంత్రులకు ఇళ్లు మొదలైనవి ఎప్పుడు నిర్మిస్తుందో...! ఒకవేళ నిర్మిస్తే అవీ తాత్కాలికమేనేమో....! లేదా శాశ్వత అసెంబ్లీ నిర్మించేవరకు 50 వేల రూపాయల అలవెన్సుతో గడుపుతారేమో. Readmore!

సచివాలయం, అసెంబ్లీ అతి తక్కువ కాలంలో నిర్మించి రికార్డు సృష్టించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కాని పదేళ్లపాటు హైదరాబాదును రాజధానిగా ఉపయోగించుకోమని కేంద్రం చెప్పింది తాత్కాలిక భవనాలు కట్టుకొని మూడేళ్లలోనే అన్నీ వదులుకొని పొమ్మనికాదు. శాశ్వత భవనాలు కట్టుకోవడానికే దశాబ్దం సమయం ఇచ్చింది. కాని బాబు తప్పులో కాలేసి పరిపాలనను ఆగమేఘాల మీద ఆంధ్రాకు తరలించారు. పైగా దాన్ని సమర్ధించుకుంటూ హైదరాబాదులో ఉంటే ఆంధ్రా ఫోకస్‌ కాదనే ఉద్దేశంతో ఇలా చేశానన్నారు. ఆ ఉద్దేశమే ఉంటే హైదరాబాదులో తన ఛాంబర్‌కు కోట్లు ఖర్చు చేసి హంగులు, రంగులు ఎందుకు కల్పించినట్లు? హైదరాబాదులో ప్రజాధనం వృథా చేయడమే కాకుండా తాత్కాలికం పేరుతో ఆంధ్రాలోనూ వృథా చేశారు. ఇప్పుటి తాత్కాలిక నిర్మాణాలను భవిష్యత్తులో మరో దాని కోసం ఉపయోగించాల్సివస్తే అందుకనుగుణంగా మళ్లీ మార్చుకోవాల్సిందే కదా.

Show comments