'బాహుబలి'పై తలసాని కొత్త క్లారిటీ

'బాహుబలి ది కంక్లూజన్‌' ఈ రోజు విడుదలవడంపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. 'ముందస్తు ప్రదర్శనలకు ఎలాంటి అనుమతి లేదు..' అంటూ 'బాహుబలి' టీమ్‌కి అల్టిమేటం ఇచ్చేసిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఈ వ్యవహారంపై మరో క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు చివరి షో, సాధారణంగా ఏ సినిమా అయితే ప్రదర్శితమవుతుందో దాన్ని రద్దు చేసి, 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాని ప్రదర్శించుకోవచ్చనీ, దీని కోసం స్థానిక పోలీసుల్నీ, ప్రభుత్వ యంత్రాంగాన్నీ చిత్ర నిర్మాతలు సంప్రదించాల్సి వుంటుందనీ చెప్పుకొచ్చారాయన. దాంతో, ఈ రోజు సాయంత్రమే 'బాహుబలి ది కంక్లూజన్‌' తొలి షో పడేందుకు మార్గం సుగమం అయినట్లే. 

హైద్రాబాద్‌లోని చాలా చోట్ల ఈ రోజు రాత్రి 9.30 నిమిషాలకు 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాని ప్రదర్శించేందుకు రంగం సిద్ధమయ్యింది. టిక్కెట్ల అమ్మకాలు జరిగిపోయాయి కూడా. ఇంతలోనే, ముందస్తు ప్రకటనలకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించడంతో కొంత గందరగోళం నెలకొంది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అయితే, సాధారణంగా పెద్ద కొత్త సినిమాల రిలీజ్‌కి ముందు రోజు రాత్రి నుంచి కంటిన్యూస్‌గా 'బెనిఫిట్‌ షోలు' పడిపోతుంటాయి. సాధారణ షో అంటే 9.30 సెకెండ్‌ షోతో పూర్తయిపోయి, రేపు ఉదయం మళ్ళీ 11 గంటలకు ఉదయం ఆటతో సినిమా ప్రదర్శన ప్రారంభమవ్వాల్సి వుంటుంది. 

కానీ, రాత్రి 9.30 కి 'బాహుబలి ది కంక్లూజన్‌' షో పడితే, ఆ తర్వాత వరుసగా షోలు ఒకదాని తర్వాత ఒకటి వేసేలా ఏర్పాట్లు చేసేసుకున్నారు. మరోపక్క, టిక్కెట్ల ధరల పెంపుపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కుపాదం మోపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెబుతుండడం గమనార్హం. ఇప్పటికే స్పెషల్‌ టీమ్‌లను పంపి, థియేటర్ల వద్ద నిఘా పెట్టామని చెబుతున్నారాయన. అదే సమయంలో, ఇంతకుముందెన్నడూ లేని విధంగా టిక్కెట్ల ధరలపై ఆందోళన తీవ్రతరమవుతోంది. థియేటర్ల వద్ద అప్పుడే ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటుండడం గమనార్హం.

Show comments