కొత్త గవర్నర్‌లు వస్తారట...మోత్కుపల్లికి ఛాన్సుందా?

కొందరికి పదవులు సులభంగా వస్తాయి. కొందరికి అడక్కుండానే వస్తాయి. కొందరు పదవుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. ఎదురుచూసేవారిలోనూ కొందరిని అదృష్టం వరిస్తుంది. కొందరు జీవితాంతం వెయిట్‌ చేసినా ఫలితం ఉండదు. తెలంగాణ టీడీపీలో సీనియర్‌ దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటివరకు మాత్రం వెయిటింగ్‌ లిస్టులోనే ఉన్నారు. రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకాలకు సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చినప్పుడల్లా మోత్కుపల్లి పేరూ తెర మీదికి వస్తూనే ఉంటుంది. ఆయనకు అవకాశం ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలు పెండింగులో ఉన్నాయి. వాటికి మే నెలలో గవర్నర్‌లను నియమించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఈ గవర్నర్‌ల జాబితాలో మోత్కుపల్లి పేరు ఉంటుందా? అని తెలంగాణ టీడీపీ నాయకులకు ఉత్కంఠగా ఉంది. మే రెండో వారంలోగా తమిళనాడు, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌లకు కేంద్రం గవర్నర్‌లను నియమిస్తుందట...!

మే 2వ తేదీన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ పదవీ కాలం ముగుస్తోంది. ఈయన్ని ఏం చేయబోతున్నారు? ఒక తెలుగు రాష్ట్రానికి పరిమితం చేసి మరోదానికి కొత్త గవర్నర్‌ను నియమిస్తారా? లేదా ఆయన్నే ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగిస్తారా? లేక ఆయనకు మరో పదవి ఏదైనా అప్పగించి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్‌లను నియమిస్తారా? నరసింహన్‌ను భారత ఉపరాష్ట్రపతిగా నియమించే అవకాశముందని గతంలో వార్తలొచ్చాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదును వదిలిపోయేముందు తెలంగాణ టీడీపీలోని సీనియర్‌ దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు మరోసారి గవర్నర్‌ పదవిపై ఆశ కల్పించారు. గతంలో కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించినప్పుడు మోత్కుపల్లి పేరు పరిశీలనకు రాలేదు. తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య పదవి నుంచి దిగిపోయినప్పుడు తరువాతి గవర్నర్‌ మోత్కుపల్లి కావొచ్చని అనుకున్నారు. కాని మహారాష్ట్ర గవర్నర్‌ కమ్‌ బీజేపీ నాయకుడు సీహెచ్‌ విద్యాసాగర్‌రావును ఇన్‌ఛార్జిగా నియమించారు.

హైదరాబాదులోని అసెంబ్లీతో  ఏపీ ప్రభుత్వం శాశ్వతంగా బంధం తెంచుకున్న సందర్భంగా  తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయిన బాబు ''సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్‌ అవుతున్నారంటే బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ తీసుకున్న చొరవే కారణం''..అని చెప్పారు. ఈ దళిత నేతకు గవర్నర్‌ పోస్టుపై చంద్రబాబు చాలా ఆశ కల్పించారు. ఒక దశలో అంతా నిర్ణయమైపోయినట్లే మాట్లాడారు. కాని అనేక పరిణామాల కారణంగా వర్కవుట్‌ అవలేదు. రోశయ్య దిగిపోయిన తరువాత కూడా మోత్కుపల్లి ప్రస్తావన లేకపోవడంతో ఆయన చాలా నిరాశ చెందారు. తన సన్నిహితుల వద్ద కూడా చెప్పుకొని బాధపడ్డారని సమాచారం. ప్రత్యేక హోదా నేపథ్యంలో కొంతకాలం క్రితం టీడీపీ-బీజేపీ సంబంధాలు బీటలు వారాయి. చంద్రబాబు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారా? అని అనుకునేంతగా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. దీంతో కేంద్రం మోత్కుపల్లిని పరిశీలించే పని పక్కన పెట్టిందని టీడీపీ నాయకులు అనుకున్నారు.  ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్తలో మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.

తాను అడిగింది మోదీ సర్కారు చేస్తుందని బాబుకు నమ్మకం ఉండేది. కాని చంద్రబాబు కోరికను మోదీ పట్టించుకోలేదు. మోత్కుపల్లి టీడీపీ సమావేశాల్లో బాబుకు 'గవర్నర్‌గిరి' గురించి గుర్తు చేశారు. అప్పటికేదో ఓదార్చారు. తరువాత రాజ్యసభ సీటు అడిగారు. తిరుపతి మహానాడులో పబ్లిగ్గానే వేడుకున్నారు. తాను చంద్రబాబుకు హనుమంతుడి వంటి భక్తుడినని, తన జీవితం టీడీపీకే అంకితమని అన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాకు మంగళం పాడి కేంద్రం ఆఫర్‌ చేసిన 'ప్రత్యేక సాయం' తీసుకోవడానికి అంగీకరించడంతో టీడీపీ-బీజేపీ సంబంధాలు మళ్లీ మెరుగుపడ్డాయి. బాబు రాజీపడిన కారణంగా మోత్కుపల్లికి పెండింగ్‌లో ఉంచిన గవర్నర్‌ పదవి ఇవ్వాలని కేంద్రం భావించిందా? తాను మెట్టు దిగొచ్చాను కాబట్టి తన మనిషికి గవర్నర్‌ పోస్టు ఇవ్వాలని బాబు అడిగుండొచ్చు....! దీనికి కేంద్రం 'సరే' అని వుండొచ్చు. మోత్కుపల్లికి గవర్నర్‌ పోస్టు దక్కితే తెలంగాణ టీడీపీ నాయకులు ఆయన పేరు చెప్పుకొని కొంతకాలం హ్యాపీగా ఉంటారు.

Show comments