జగన్ ఆస్తుల ఈడీ అటాచ్ మెంట్ అసలు కథ ఇదా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామ్యులు, మాజీ మంత్రులు.. వీళ్లందరిపై నమోదైన క్విడ్ ప్రో కో కేసుల్లో.. గత కొన్ని రోజులుగా డెవలప్ మెంట్స్ ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. అనేక మంది వ్యాపార వేత్తలు ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ నుంచి మినహాయింపు పొందుతున్నారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఐఏఎస్ లకు చంద్రబాబు ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చింది! 

ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ , రెడ్ గోల్డ్ సజ్జల దివాకర్ రెడ్డిల విషయంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు చూస్తుంటే.. వాళ్లు విముక్తులు అయిన తీరును గమనిస్తే..  ఈ కేసులో దూదిపింజలా తేలిపోయే అవకాశం ఉందనే భావన కలిగింది జనాల్లో. వరసగా క్లీన్ చిట్లు, విచారణ నిలిపివేతలు..వంటి పరిణామాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చిన ఈ వ్యవహారం లో ఉన్నట్టుండీ ఈడీ అటాచ్ మెంట్ ఆసక్తికరమైన అంశం.

మరి దీని వెనుక కథేంటి? అని ఆరా తీస్తే.. ఢిల్లీ స్థాయిలో ఏపీ లాబీ ఫలితంగానే సీబీఐ అటాచ్ మెంట్లోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని తెలుస్తోంది! ప్రత్యేకంగా ఏపీ లాబీ ఇప్పుడు జగన్ విషయంలో ఒత్తిడి ఎందుకు పెంచింది? అంటే.. దానికి కారణం సదావర్తి భూముల వ్యవహారం అని సమాచారం.

సదావర్తి భూముల స్కామ్ లో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వెయ్యి కోట్ల రూపాయలు విలువజేసే భూమిని కేవలం పాతిక కోట్ల రూపాయల ధరకే కొట్టేసిన విధానం పై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ఈ భూముల వ్యవహారంలో నిజనిర్ధారణ కమిటీ అంటూ చెన్నై వరకూ వెళ్లి వచ్చారు జగన్ పార్టీ నేతలు. హిందూ సత్రం వారి భూములను వేలం పాటలో తెలుగుదేశం అనుకూలమైన వ్యక్తులు దక్కించుకున్న తీరు చిన్న పిల్లాడినైనా ఆశ్చర్యపరుస్తుంది.

ఈ వేలం  ప్రక్రియలో ఎన్నో అక్రమాలున్నాయన్నది వాస్తవం. ఈ విషయంలో అడ్డంగా దొరికిపోయింది అధికార పార్టీ. ఇదేమీ అల్లాటప్పా కేసు కాదు.. సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోకుండా హిందూ సత్రం ఆస్తులను వేలం వేశారు, ఆ వేలం గురించి సరిగ్గా పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు, వేలంలో పాల్గొన్న నలుగురికి సంబంధించి డిపాజిట్లూ ఒకే వ్యక్తి చేశాడు, అధికార దుర్వినియోగం, ఎక్కడో తమిళనాడులోని ఒక హిందూ సత్రం ఆస్తులను రెండు శాతం ధరకే దక్కించుకున్నారు! అంటే వందకు 98 రూపాయల లాభం. వెయ్యి కోట్ల వ్యవహారానికి 980 ఎనభై కోట్ల రూపాయల లాభం!

నాలుగేళ్లుగా జగన్ అనుదినం వార్తల్లో ఉంటున్న జగన్ వ్యవహారంలో జప్తు చేసినది 749 కోట్లరూపాయల ఆస్తులు అయితే.. ఒక్క సదావర్తి స్కామ్ విలువ 980 కోట్ల రూపాయలు! జగన్ కేసుల విషయంలో ఒక్క ఆధారమూ సరిగా లేదు. ఆరోపణలే ఆధారాలక్కడ. సదావర్తి విషయంలో మాత్రం.. ఏపీ ప్రభుత్వం అడ్డం గా దొరికిపోయింది. ఇది ఇప్పుడు కోర్టు వరకూ ఎక్కింది.

ఇలాంటి నేపథ్యంలోనే.. ఇరకాటంలో పడి ఇబ్బందుల్లో పడిన తెలుగుదేశం వాళ్లు, తమ మిత్రపక్షం బీజేపీ పై ఒత్తిడి తెచ్చి, ఆర్థిక శాఖ ముఖ్యుడితో ఏపీకి చెందిన ఒక కేంద్ర మంత్రి(తెలుగుదేశం ఎంపీ), బీజేపీకి చెందిన ఒక రాష్ట్ర మంత్రి.. ఇద్దరూ ప్రత్యేకంగా సమావేశం అయ్యి.. తాము ఇరకాటంలో పడిన విధానాన్ని వివరించి, ఇప్పుడు జగన్ కేసును కదిలించాల్సిందే అనే ఒత్తిడి చేసి ఈడీ జప్తు కు పావులు కదిపారని సమాచారం.

ఇక ఈడీ జప్తు విషయంలో ఏపీలోని పచ్చ మీడియా కూడా  చాలా హడావుడే చేసింది. ఈడీ జప్తు తర్వాత జగన్ ఎవరినీ కలవడం లేదని, జ్యోతిష్యులను సంప్రదించాడని.. వగైరా కథనాలు రావడం కూడా సదావర్తి భూముల వ్యవహారం నుంచి జనాలను డైవర్ట్ చేయడంలో భాగమే. జనాలు జగన్ ఆస్తుల స్తంభన గురించి మాట్లాడుకొంటారు.. ఈ అటాచ్ మెంట్ హడావుడిలో సదావర్తి వేడి తగ్గుతుందన్న భావనతో నే జగన్ విషయంలో ఈడీ స్పందన జరిగిందని.. ఇది పక్కా రాజకీయ ఎత్తుగడ అని ఢిల్లీ ఇస్తున్న సమాచారం.

Show comments